కార్తిక పౌర్ణమి విశిష్టత ఏమిటి?

మాసాలన్నింటిలోనూ పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. శివ-విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తిక పౌర్ణమిని శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అనీ పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక ...........

Updated : 14 Mar 2023 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాసాలన్నింటిలోనూ పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. శివ-విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తిక పౌర్ణమిని శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అనీ పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తిక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి, సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమనాడే. దత్తాత్రేయ జన్మదినమూ ఇదే! దేవ దీపావళి, కుమార దర్శనమనీ ఈ పర్వడికి పేర్లున్నాయి. ఈ రోజున ‘రాసలీలా మహోత్సవం’ జరుపుతారు. యోగసిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది.

నేటి సముద్రస్నానం శివారాధన, అభిషేకం, ఉసిరిక, దీపారాధనలకూ విశేషమైన ఫలితాలున్నాయి. శంకరుడు త్రిపురాసురుణ్ని వధించిన విజయోత్సాహానికి సంకేతంగా స్త్రీలు 720 వత్తుల నేతి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతం ఆచరిస్తారు. మహిషాసురవధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తిక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మథనం సందర్భంగా వెలువడిన హాలాహలం మింగి శివుడు లోకసంరక్షణం చేసినందుకు సంతోషంతో ప్రజలు ‘జ్వాలాతోరణోత్సవం’ ఈ శుభదినాన నిర్వహించారు. ఈ రోజున ‘వృషోత్సర్జనం’ అనే ఉత్సవం జరుపుకొంటారు. పితృదేవుల ప్రీత్యర్థం ఒక కోడెదూడను ఆబోతుగా వదులుతారు. ఇలా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయంలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు.

ఉసిరిక చెట్టు కింద కార్తిక దామోదరుడిగా కీర్తిపొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికాయలతో పూజిస్తారు. కొందరు ఈ రోజున తులసిని, వ్యాసుణ్ని ఆరాధిస్తారు. దీపదానం, బిళ్వదళార్చన, ఉపవాసం, జాగరణ, శతలిం గార్చన, సహస్ర లింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి, బంగారు, సాలగ్రామం, భూ, గోదానం, అన్నదానాలకు కార్తిక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం, మహీ ఫలవ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమా వ్రతం, కృత్తికావ్రతం లాంటి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తుంటారు. శైవ-వైష్ణవాలయాల్లో ఎంతో సభక్తికంగా జరిగే జప, తప, దీపదాన, పూజాదికాలకు అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తిక పౌర్ణమి.

ఇంతటి పరమ పవిత్రమైన కార్తిక పౌర్ణమి రోజున, సిక్కు ధర్మ స్థాపకుడు గురు నానక్‌ జన్మించాడు. ఆయన కారణజన్ముడు. ఆచారాలను వ్యతిరేకించి, కుల మత రహిత సమసమాజ నిర్మాణానికి దైవ ఆదేశంతో ఉపక్రమించాడు. మన దేశంలోని పలు ప్రాంతాలను దర్శించి పలువురిలో అంధ విశ్వాసాలను మూఢాచారాలను మాన్పగలిగాడు. టిబెట్‌, చైనా, సిలోను, మక్కా, మదీనాలను దర్శించి భగవంతుడి ఏకత్వాన్ని ప్రచారం చేశాడు. ఆయన కృషిని, తొమ్మిదిమంది సద్గురువులు కొనసాగించారు. వారందరినీ సిక్కులు గురు నానక్‌ తదుపరి అవతారాలుగా, ఆత్మజ్యోతులుగా భావిస్తారు.

దశావతారాలతో పోల్చదగిన విధంగా, గురు నానక్‌తో కలిపి పదిమంది సిక్కు గురువులు ఆధ్యాత్మిక ప్రపంచానికి దిక్సూచులుగా వర్ధిల్లారు. ప్రస్తుతం ‘గురు గ్రంథ సాహెబ్‌’ గురువుగా పూజలందుకుంటోంది.

‘నేను హిందువునో, ముసల్మానునో చూడటం లేదు. కేవలం మనిషిని చూస్తున్నాను’ అనేవారు నానక్‌.

జననం ముందు, మరణించాక మనిషి ఆత్మ స్వరూపుడే! దేహాన్ని దహిస్తారు. అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. పంచభూతాల్లో కలిసిపోతుంది. అందువల్ల, శరీర భ్రాంతి నుంచి అతడు బయటపడాలి. కుల మతాలకు అతీతమైన ఆత్మగానే ప్రాణుల్ని చూడాలి. రూపానికి ఎలాంటి ప్రాధాన్యమూ లేదనడమే శివుడి నిరాకారత్వం.

గురు నానక్‌ బోధనల సారాంశమూ అదే. మనిషికి ఉన్నది కేవలం ఆత్మే. మరొకటి లేదు. అది గ్రహించడమే జ్ఞానం!

ఇదీ చదవండి

తెలుగురాష్ట్రాల్లో కార్తిక శోభ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని