KCR: ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పింఛన్‌ : కేసీఆర్‌

తెలంగాణ ఉద్యమసమయంలో ఏం కోరుకున్నామో..వాటిని ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన భారస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Updated : 09 Jun 2023 20:26 IST

మంచిర్యాల: రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్‌ను మరో వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే నెల నుంచి రూ.4,116 పింఛను చెల్లిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాలలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారని. అలాంటిది ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.

సింగరేణి నడక, స్టైల్‌ మారింది..

‘‘సంక్షేమంలో, వ్యవసాయంలో బాగున్నాం. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. ఇది మన సొంత ఆస్తి. వేలాది మందికి అన్నం పెట్టిన సంస్థ. కాంగ్రెస్‌ సింగరేణిని సర్వనాశనం చేసింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తీసుకొచ్చింది. మన సొంత కంపెనీని అప్పులు చెల్లించక 49శాతం వాటా కింద కేంద్రానికి కట్టబెట్టింది. 2014లో భారాస రాకముందు కార్మికులకు బోనస్ 18శాతమే. అంటే.. రూ.50-60 కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చాక సింగరేణి నడక, స్టైల్‌ మారింది. కేవలం రూ.11వేల కోట్లు మాత్రమే సింగరేణి టర్నోవర్‌ ఉండేది. ఇప్పుడు రూ.33వేల కోట్లకు పెంచుకున్నాం. సింగరేణికి లాభాలు గతంలో రూ.300-400 కోట్లు మాత్రమే ఉండేది. ఇవాళ రూ.2,184 కోట్ల లాభాలు గడించింది. గతంలో రూ.50-60 కోట్లు బోనస్‌ ఇచ్చేవారు. కానీ, ఈసారి దసరాకు సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్‌ రూ.700 కోట్లు పంచబోతున్నాం. ఆనాడు కంపెనీకి వచ్చే లాభాల కన్నా మూడు రెట్లు బోనస్‌ ఇచ్చే పరిస్థితికి సింగరేణిని తీసుకొచ్చాం.

కాంగ్రెస్‌ సగం ముంచితే.. భాజపా పూర్తిగా ముంచుతోంది

సింగరేణి సంస్థను గత కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆగం చేసింది. ఇప్పుడు సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని భాజపా చూస్తోంది. దేశంలో సరిపడా బొగ్గు ఉన్నా.. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తోంది. సింగరేణిని కాంగ్రెస్‌ సగం ముంచితే, భాజపా పూర్తిగా ముంచుతోంది. కాంగ్రెస్‌ హయాంలో కేవలం 6453 ఉద్యోగాలు మాత్రమే కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏకంగా 19,463 ఉద్యోగాలు కల్పించాం. మొత్తం 1,556 మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇచ్చాం. కార్మికులు దురదృష్టవశాత్తు చనిపోతే కేవలం రూ.లక్ష ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. కానీ, భారాస ప్రభుత్వం ప్రమాద బీమాను పెంచి రూ.10లక్షలు ఇస్తోంది. రిటైర్మెంట్‌ తీసుకున్నాక రూ.25లక్షలు ఇస్తున్నాం. కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా రూ.10 లక్షలు రుణసాయం అందిస్తున్నాం.

ధరణి పోతే దళారీల రాజ్యమే..

మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ను రూపొందించాం. దీంతో మండల కేంద్రంలోనే గంటసేపట్లో భూమి రిజిస్ట్రేషన్‌ అవుతోంది. ధరణి పుణ్యం వల్లే రైతుబంధు, రైతుబీమా అమలవుతోంది. ధరణితో రైతు భూమిని ఎవరూ ఆక్రమించకుండా చేశాం. వీఆర్వో, తహశీల్దార్‌కు లంచం ఇచ్చే పని లేకుండా చేశాం. ధరణి లేకుంటే రైతుబంధు ఎలా వస్తుందో ప్రజలు ఓసారి ఆలోచించుకోవాలి. ధరణి పోర్టల్‌ పోతే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న వాళ్లనే సముద్రంలో వేయాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని