Tamilisai and KCR: రాజ్‌భవన్‌కు కేసీఆర్‌.. గవర్నర్‌, సీఎంల మధ్య చిరునవ్వులు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎనిమిది నెలల తర్వాత ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11న అప్పటి సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణస్వీకారం కోసం ..

Updated : 28 Jun 2022 13:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎనిమిది నెలల తర్వాత ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11న అప్పటి సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణస్వీకారం కోసం వెళ్లిన ఆయన.. ఆ తర్వాత రాజ్‌భవన్‌ వైపు చూడలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్ ప్రమాణస్వీకారానికి ఇవాళ కేసీఆర్‌ హాజరయ్యారు. ఇటీవల రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం బాగా పెరిగిన విషయం తెలిసిందే. వివిధ అంశాల్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలొచ్చాయి. తనకు ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని, కనీసం తల్లి మరణిస్తే కూడా కేసీఆర్ పలకరించలేదని గవర్నర్ తమిళిసై గతంలో వ్యాఖ్యానించారు. ఒక మహిళగానైనా తనకు గౌరవం ఇవ్వరా?అని ప్రశ్నించారు.

ఇదే సందర్భంలో గవర్నర్ వైఖరిని మంత్రులు తప్పుబట్టారు. ఈ క్రమంలో రాజ్ భవన్, ప్రభుత్వం మధ్య రాజకీయ పరమైన విమర్శలు కూడా వచ్చాయి. గవర్నర్‌ నివాసంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సీఎం సహా మంత్రులు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సీజే ప్రమాణస్వీకారం కోసం సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం పరస్పరం పుష్పగుచ్ఛాలతో గౌరవించుకున్నారు. ఈ సమయంలో ఇరువురి మధ్య చిరునవ్వులు వెల్లివిరిశాయి. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందులోనూ సరదాగా ఉన్నారు. గవర్నర్, సీఎం మధ్య సమావేశం సాఫీగా, సహృద్భావ వాతావరణంలో జరిగిందని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని