Cold wave: బాబోయ్‌చలి చంపేస్తోంది..ఈ చిట్కాలతో సేఫ్!

చలిపులి పంజా విసురుతోంది. చలిగాలుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. బయట అడుగు పెట్టాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు..........

Updated : 21 Dec 2021 10:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చలిపులి పంజా విసురుతోంది. చలిగాలుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. బయట అడుగు పెట్టాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి తీవ్రమైన చలిగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు మరింత ‘వణుకు’ పుట్టిస్తున్నాయి. చల్లని వాతావరణ పరిస్థితులు తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి? మన ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు, చర్మాన్ని సురక్షితంగా ఉంచుకొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా..!

పొగమంచు యమా డేంజర్‌..

శీతాకాలంలో సాధారణంగానే అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారిలో అయితే దీని ప్రభావం మరీ అధికం. జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, చర్మసంబంధమైన సమస్యలు వేధిస్తుంటాయి. మరీ ముఖ్యంగా చలిలో బయట ఉన్నప్పుడు శరీరంలో వణుకు వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మన శరీరం ఉష్ణోగ్రతల్ని కోల్పోతోందని చెప్పేందుకు అదొక సంకేతం. అలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే ఇంట్లోకి వెళ్లిపోవాలి.

అలాగే, ఎక్కువ సమయం పాటు చలిలో ఉంటే ఆ మంచు వల్ల మన శరీరం మొద్దుబారిపోతుంది. తద్వారా చర్మం పాలిపోవడం, ముక్కు, చెవి, వేళ్లు వంటి శరీరభాగాల్లో నల్లటి బొబ్బలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలి. దీనికితోడు దట్టమైన పొగమంచు శరీరంపై తీవ్ర దుష్ప్రభావాల్ని చూపుతుంది. ప్రత్యేకించి శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారికైతే ఈ మంచు మరీ డేంజర్‌! దట్టమైన పొగమంచులో ఉండే నలుసు పదార్థాలతో పాటు ఇతర కాలుష్య కారకాలు మన ఊపిరితిత్తుల్లోకి చేరి మూసుకుపోయేలా చేస్తాయి. ఊపిరితిత్తులు పనిచేసే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీంతో గురక, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఈ చిట్కాలు పాటించండి..

ఎప్పటికప్పుడు చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. నూనెలు/క్రీములను వాడాలి.

విటమిన్‌ ‘సి’ విరివిగా ఉండే పండ్లు, కూరగాయలను తినాలి. శరీరానికి అవసరమైన మోతాదులో పానీయాలు (వేడిగా ఉండాలి) తీసుకోవడం ద్వారా మన రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంచుకొనేలా జాగ్రత్త తీసుకోవాలి. 

చర్మం పొడిగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ తడిగా ఉన్నట్లయితే తక్షణమే మీ దుస్తుల్ని మార్చుకొని శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా జాగ్రత్తపడండి. స్వెటర్లు.. వాటర్‌ప్రూఫ్‌ షూ ధరించండి.

చర్మం నల్లగా మారితే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

• చలి కాలంలో ఆహారం, తాగునీరు ద్వారా అంటువ్యాధులు సోకే ప్రమాదం అధికం. కాబట్టి ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. ఈ కాలంలో గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.

• చలికాలంలో పొగమంచు ఎక్కువ. కాలుష్య కారకాలు గాలిలో ఎక్కువ సమయం ఉంటాయి. ఈ కారణంగా ఉదయపు నడకకు వెళ్లే వారు శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశాలుంటాయి. ఎండ వచ్చాక లేదా సాయంత్రం సమయాల్లో వ్యాయామం చేయడం మంచిది.

•  పిల్లలను బడికి పంపే సమయంలో ఉన్ని దుస్తులు ధరింపజేయాలి. కాచి చల్లార్చిన నీరు, పరిశుభ్రమైన ఆహారం అందించాలి.

వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం, క్యాన్సర్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు చలి కాలంలో త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు వైద్యుల సలహాతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంట్లో హీటర్లను వాడుతున్నప్పుడు వాటి నుంచి వెలువడే విషపూరిత పొగను పీల్చకుండా ఉండేలా తగిన వెలుతురు ఉండేలా చూసుకోండి. గ్యాస్‌ లేదా ఎలక్ట్రిక్‌ వస్తువులు వాడుతుంటే మాత్రం జాగ్రత్తలు పాటించండి.

శ్వాససంబంధమైన ఇబ్బందులతో బాధపడేవారు మాత్రం అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. ఒకవేళ వెళ్తే మీ ముఖాన్ని కప్పుకోండి.

Read latest General News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని