మనసుల్ని కట్టిపడేస్తున్న ఓ బీడీ కార్మికుడి త్యాగం!

కరోనా కష్టాలనే కాదు.. అనేక గుణపాఠాలనూ నేర్పింది. మనుషుల్లోని దాతృత్వాన్ని మేల్కొల్పింది. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి బతకడం నేర్పింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో........

Published : 26 Apr 2021 12:45 IST

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.2 లక్షల విరాళం

తిరువనంతపురం: కరోనా కష్టాలనే కాదు.. అనేక గుణపాఠాలనూ నేర్పింది. మనుషుల్లోని దాతృత్వాన్ని మేల్కొల్పింది. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి బతకడం నేర్పింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తిని రుచి చూపింది. కేరళకు చెందిన ఓ బీడీ కార్మికుడి సహృదయం ఇప్పుడు నెటిజన్ల మనసుల్ని దోస్తోంది. సాటి మనుషుల్ని కాపాడుకునేందుకు ఆయన చేసిన త్యాగం సీఎం ప్రశంసల్ని దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే..

2018లో వచ్చిన వరదలతో కేరళ ఖజానాపై తీవ్ర ప్రభావం పడింది. దాని నుంచి తేరుకుంటున్న తరుణంలోనే కరోనా పిడుగులా వచ్చి పడింది. ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింది. దీంతో ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఖర్చుల్ని భరించడం కేరళకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కోసం విరాళాలు ఇవ్వాలని  సీఎం పినరయి విజయన్‌  పిలుపునిచ్చారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. విరాళాలు వెల్లువలా వచ్చి చేరాయి. ఈ క్రమంలో అనేక స్ఫూర్తి గాథలు వెలుగులోకి వచ్చాయి. అందులో భాగమే ఈ బీడీ కార్మికుడి త్యాగం.

కన్నూర్‌కు చెందిన ఓ బీడీ కార్మికుడు తాను బ్యాంకులో దాచుకున్న రూ.రెండు లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేశారు. ప్రస్తుతం ఖాతాలో రూ.850 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది చూసి ఆశ్చర్యపోయిన బ్యాంకు అధికారులు.. ఆయన ఆర్థిక స్తోమతను అర్థం చేసుకొని తొలుత రూ.లక్ష మాత్రమే ఇవ్వాలని సూచించారు. కానీ, అందుకు ఆయన ససేమిరా అన్నారు. ‘కావాలంటే నేను మళ్లీ బీడీలు చుట్టుకొని సంపాదించుకుంటాను. పైగా నాకు దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ కూడా వస్తోంది. సాటి మనుషుల ప్రాణాల కంటే నా డబ్బు గొప్పదేం కాదు’’ అంటూ ఆయన ఇచ్చిన సమాధానం వారందరి మనసుల్ని కట్టిపడేసింది. పైగా తన పేరు ఎక్కడా చెప్పొద్దని కూడా బ్యాంకు అధికారుల్ని కోరారట!

ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఆయన దాతృత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల దృష్టికి రావడంతో ప్రస్తుతం ఆ బీడీ కార్మికుడిపై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన స్ఫూర్తితో అనేక మంది విరాళాలు కూడా ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని