మా కాళ్లతో నడిచేయ్ నేస్తం.. స్నేహం విలువను చాటిచెప్పే వీడియో వైరల్‌

సంతోషమైనా బాధైనా గుర్తొచ్చేది స్నేహితులే, డబ్బున్నా లేకున్నా నేనున్నా అనేది ఫ్రెండే. అలాంటి స్నేహం గొప్పతనం కళ్లకుకట్టినట్లు చూపుతున్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Published : 08 Apr 2022 12:18 IST

కొల్లాం: సంతోషమైనా.. బాధైనా గుర్తొచ్చేది స్నేహితులే. డబ్బున్నా, లేకున్నా.. నేనున్నా అనేది ఫ్రెండే. అలాంటి స్నేహం గొప్పతనం కళ్లకు కట్టినట్లు చూపుతున్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేరళకి చెందిన అలిఫ్‌ మహమ్మద్‌ పుట్టుకతోనే దివ్యాంగుడు. కొల్లాంలోని డీబీ కళశాలలో బీకామ్‌ చదువుతున్నాడు. రోజూ కాలేజీకి రావడానికి, తరగతులకు హాజరుకావడానికి అతడిని స్నేహితులు భుజాలపై మోస్తూ లోపలికి తీసుకువెళ్తారు. అయితే.. కాలేజీలో ఇటీవల జరిగిన యూత్‌ ఫెస్టవల్‌లో అందరి హృదయాలను హత్తుకునే ఓ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆర్చన, ఆర్య అనే ఇద్దరు తొటి కాలేజ్‌ అమ్మాయిలు.. అలిఫ్‌ను వారి భుజాలపై మోస్తూ కళాశాల ప్రాంగణమంతా తిప్పారు. ఆ దృశ్యాలను అక్కడే ఉన్న తులసిధరన్‌ అనే వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో క్లిక్‌మనిపించారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ఇది చాలా గొప్ప క్షణం. రోజూ అలిఫ్‌ని అతడి స్నేహితులు తీసుకువెళ్తారు. యూత్‌ ఫెస్టివల్‌రోజు ఇద్దరు అమ్మాయిలు అతడికి ఊతమిస్తూ కాలేజీలో తిప్పడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే నా కెమెరాలో ఆ అద్భుత దశ్యాలను బంధించాను. వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. అవి స్నేహం విలువను చాటిచెబుతున్నాయి’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు