Amazon: పాస్‌పోర్ట్‌ కవర్‌ బుక్‌ చేస్తే.. పాస్‌పోర్టే వచ్చేసింది!

‘అదేంటి! ఒకటి బుక్‌ చేస్తే.. మరొకటి వచ్చింది’ అంటూ ఇటీవల కాలంలో ఈ-కామర్స్‌లో ఆర్డర్స్‌ పెట్టి..  అవ్వాక్కైన వారి గురించి వింటూనే వచ్చాం. ‘రిమోట్‌ కారు ఆర్డర్‌ చేస్తే.. బిస్కెట్‌ ప్యాకెట్‌ వచ్చిందని’.. ‘పవర్‌ బ్యాంక్‌ బుక్‌ చేస్తే గిన్నెలు తోమే విమ్‌ బార్‌ పంపించారు’

Published : 06 Nov 2021 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఒకటి బుక్‌ చేస్తే.. మరొకటి వచ్చింది’ అంటూ ఇటీవల కాలంలో ఈ-కామర్స్‌లో ఆర్డర్స్‌ పెట్టి..  ఆశ్చర్యపోయిన వారి గురించి వింటూనే ఉన్నాం. ‘రిమోట్‌ కారు ఆర్డర్‌ చేస్తే.. బిస్కెట్‌ ప్యాకెట్‌ వచ్చిందని’.. ‘పవర్‌ బ్యాంక్‌ బుక్‌ చేస్తే గిన్నెలు తోమే విమ్‌ బార్‌ పంపించారు’ అని కస్టమర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలకు ఫిర్యాదు చేయడమే కాదు.. సరదాగా నెట్టింట్లోనూ పంచుకున్నారు. ఈసారీ అలాంటే ఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. కేరళలోని వయనాడ్‌కి చెందిన మిథున్‌ బాబు అనే ఓ వ్యక్తి గతనెల 30న అమెజాన్‌లో పాస్‌పోర్ట్‌ కవర్‌ ఆర్డర్‌ పెట్టాడు. రెండు రోజుల్లో అది డెలివరీ కాగా..  తెరిచి చూడగానే ఒక్కసారిగా అందులో ఉన్న విలువైన వస్తువును చూసి ఖంగుతిన్నాడు. బుక్‌ చేసింది పాస్‌పోర్ట్‌ కవర్‌ అయితే అందులో ఉన్నది మాత్రం వేరొకరి ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌ కావడమే అందుకు కారణమట. ఇక పాస్‌పోర్ట్‌ ఎవరిదా అని పరిశీలించి చూస్తే..  కేరళలోని త్రిశూర్‌కి చెందిన ఓ టీనేజీ అబ్బాయిదిగా గుర్తించాడు. వెంటనే అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశాడు మిథున్‌. ‘‘ సుమారు 40 నిమిషాల పాటు కస్టమర్‌ కేర్‌ ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌తో మాట్లాడా. అందులో ఒక్కరూ కూడా ఏం చేయాలో చెప్పలేదు. నా మిత్రుడి సలహాతో.. వెంటనే పోలీసులకు పాస్‌పోర్ట్‌ అందజేశా’’ అన్నాడు. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించగా.. అది మా అబ్బాయిదేనంటూ అతడి తల్లి అస్మాబి చెప్పింది. ‘‘ అక్టోబర్‌ మధ్యలో నా భర్త పాస్‌పోర్ట్‌ కవర్‌ ఆర్డర్‌ చేశారు. అందులో పాస్‌పోర్ట్‌ సరిగ్గా ఫిట్‌ అవ్వకపోవడంతో.. దాన్ని రిటర్న్‌ పెట్టేశాం. పొరపాటున పాస్‌పోర్ట్‌ తీయకపోవడంతో కవర్‌తో సహా పాస్‌పోర్ట్‌.. అలానే అమెజాన్‌కు చేరింది. ఆ తప్పిదం వల్ల ఇదంతా జరిగింది’’ అంటూ జరిగిన విషయాన్ని బయటపెట్టారామె.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని