పీపీఈ కిట్ల వ్యర్థాలతో దుప్పట్ల తయారీ!

పునఃవినియోగానికి వీలులేని పీపీఈ కిట్ల వ్యర్థాలను దుప్పట్లుగా మారుస్తున్నారు కేరళకు చెదిన లక్ష్మీ మీనన్‌. కొంతకాలం డిజైనర్‌గా పనిచేసి లక్ష్మీ మీనన్‌ గతేడాది మార్చిలో ‘ప్యూర్‌ లివింగ్‌’ అనే కంపెనీని ప్రారంభించారు....

Updated : 10 Mar 2021 04:28 IST

కాలుష్య నివారణే ధ్యేయంగా కేరళ మహిళ కృషి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా విజృంభణ కారణంగా పీపీఈ కిట్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. వైరస్‌ బాధితులు, వారికి సేవలందించే వైద్యులు, కొవిడ్‌ వారియర్లు సహా అనేక మంది వీటిని ధరిస్తున్నారు. పీపీఈ కిట్లు తయారు చేసే క్రమంలో వ్యర్థాలు భారీగా పోగైపోయి నిరుపయోగంగా మారుతున్నాయి. పునః వినియోగానికి వీలులేని ఆ వ్యర్థాలను దుప్పట్లుగా మారుస్తున్నారు కేరళకు చెందిన లక్ష్మీ మీనన్‌. కొంతకాలం డిజైనర్‌గా పనిచేసి లక్ష్మీ మీనన్‌ గతేడాది మార్చిలో ‘ప్యూర్‌ లివింగ్‌’ అనే కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా పీపీఈ కిట్లు, చేతి గ్లౌజులు, మాస్కులు తయారు చేసే కర్మాగారాల్లో వ్యర్థాలను సేకరించడం మొదలుపెట్టారు. వాటితో దుప్పట్లు, అందంగా అల్లిన తాళ్లను తయారు చేస్తున్నారు. 

ప్యూర్‌ లివింగ్‌ ద్వారా తయారు చేస్తున్న శయ్యా దుప్పట్లకు, అల్లిన తాళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. వీటిని విక్రయించేందుకు ఉత్పత్తి చేయడం లేదు.. పేద ప్రజలకు, కొవిడ్‌ సెంటర్లకు పంపిణీ చేసేందుకు తయారు చేస్తున్నారు. పీపీఈ కిట్లతో తయారు చేసిన వెయ్యికిపైగా దుప్పట్లను కేరళ వ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేశారు. పీపీఈ కిట్ల వ్యర్థాలతో దుప్పట్లు తయారు చేసే విధానాన్ని అందరికీ అందుబాటులోకి ఉంచేందుకు దానిపై ఎలాంటి పేటెంట్‌ను తీసుకోలేదు లక్ష్మీ మీనన్‌. ప్రతిఒక్కరు వ్యర్థాల పునఃవినియోగానికి కృషి చేసి పర్యావరణ హితానికి పాటుపడాలనేది ఆమె ఉద్దేశం. తనకున్న పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. కాలుష్య రహిత సమాజం కోసం లక్ష్మీ మీనన్‌ చేస్తున్న కృషిని పర్యావరణవేత్తలు ప్రశంసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని