Kerala: తెరుచుకున్న శబరిమల ఆలయం

కొవిడ్‌ నేపథ్యంలో కొద్ది వారాలుగా మూసి ఉంచిన కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తుల సందర్శనార్థం శనివారం తెరుచుకుంది.

Published : 18 Jul 2021 01:26 IST

తిరువనంతపురం: కొవిడ్‌ నేపథ్యంలో కొద్ది వారాలుగా మూసి ఉంచిన కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తుల సందర్శనార్థం శనివారం తెరుచుకుంది. భక్తులు నెలవారీ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ నెల 21 వరకు దేవాలయాన్ని తెరచి ఉంచనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఐదు రోజుల్లో గరిష్ఠంగా ఐదు వేల మంది  భక్తులను మాత్రమే స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు అన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపాయి. భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రం లేదా గడిచిన 48 గంటల్లో చేయించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌ రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశాయి.

కేరళలో కొవిడ్‌ ఉద్ధృతి  కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహమ్మారిని నియంత్రించేందుకు ఇప్పటికీ అక్కడ వారాంతపు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,22,436 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటివరకు అక్కడ 29,93,242 మంది కోలుకున్నారు. 15,155 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌లో భాగంగా 1,64,86,091 మంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు. వారిలో 1,19,18,696 మంది తొలి డోసు తీసుకోగా.. 45,67,395 మంది రెండో డోసు తీసుకున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని