Telangana News: టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలనిఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని

Updated : 25 Jun 2022 17:31 IST

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్‌ జావేద్‌ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్‌బోర్డు సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. జావేద్‌ అలీపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్స్‌ చేసింది. జావేద్‌ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్‌ విభాగం సిఫార్స్‌ చేసింది. సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు ఉండాలని సూచించింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర..చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిఫార్సు మేరకు పాఠశాల విద్యాశాఖ  ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

టీచర్లపై కక్షకట్టిన సీఎం: బండి సంజయ్‌

టీచర్ల ఆస్తుల విషయంలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేయడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లపై సీఎం కేసీఆర్‌ కక్షగట్టారని ఆరోపించారు. ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు వెల్లడించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమేనన్నారు. సీఎం కేసీఆర్‌ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని