మధుమేహులూ.. మరింత జాగ్రత్త! 

ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా కరోనా జబ్బు మీదే. అలాగని ఇతర జబ్బులపై.. ముఖ్యగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 42.2 కోట్ల మంది మధుమేహం బారినపడుతుండగా.. దాదాపు 16 లక్షల మంది దీంతో మృత్యువాత

Updated : 28 Nov 2020 09:38 IST

ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా కరోనా జబ్బు మీదే. అలాగని ఇతర జబ్బులపై.. ముఖ్యగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 42.2 కోట్ల మంది మధుమేహం బారినపడుతుండగా.. దాదాపు 16 లక్షల మంది దీంతో మృత్యువాత పడుతున్నారు. మనదేశంలో 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో ప్రతి ఆరుగురు మధుమేహుల్లో ఒకరు మనదేశానికి చెందినవారే కావటం గమనార్హం. అందువల్ల దీనిపై అశ్రద్ధ తగదు. చికిత్సలు, పరీక్షలు చేయించుకోవటానికి బయటకు వెళ్లటం ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారి కాలంలో ఇది మరింత ముఖ్యం. ఆహారం, బరువు, దీర్ఘకాల దుష్ప్రభావాలు, సహ జబ్బులపై కన్నేసి, తగు జాగ్రత్తలు పాటించటం ఎంతైనా అవసరం.

ఆహారం మీద శ్రద్ధ

మధుమేహులందరికీ ప్రత్యేకించి ఒకేరకం ఆహార పద్ధతంటూ ఏదీ లేదు. ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి పెడితే చాలు. రోజూ సమయానికి భోజనం చేయటం, తగు నిష్పత్తుల్లో పదార్థాలు ఉండేలా చూసుకోవటం మంచిది. 

* అన్నింటినీ కొలుచుకొని మరీ తినలేకపోవచ్చు గానీ పళ్లెంలో ఆయా పదార్థాలు తగు మోతాదుల్లో ఉండేలా చూసుకోవచ్చు. సగం పళ్లెంలో కూరగాయలు, ఆకుకూరలు; మరో సగంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉంటే మంచిది. 

* భోజనంలో విధిగా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. గుడ్డులోని తెల్ల సొన, చికెన్, చేపలతో నాణ్యమైన మంచి ప్రొటీన్‌ లభిస్తుంది. శాకాహారంలోనైతే పప్పులు, పాల పదార్థాలు, గింజపప్పుల్లో ప్రొటీన్‌ దండిగా ఉంటుంది.

* వీలైనంతవరకు పొట్టుతీయని తృణధాన్యాలు తీసుకోవాలి. వీటిల్లోని పిండిపదార్థాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా కలుస్తుంది. పీచు కూడా ఎంతో మేలు చేస్తుంది. త్వరగా కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువెక్కువ తినకుండా చూస్తుంది. ఒకవేళ త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు అయితే తక్కువగానే తినాలి. వీటికి మంచి ప్రొటీన్‌ జతచేసుకోవాలి.

* నూనెల విషయంలో బహుళ అసంతృప్త కొవ్వులతో కూడిన పొద్దుతిరుగుడు, తవుడు, సోయాబీన్‌ నూనెల వంటివి మేలు. మన కంటికి కనిపించకపోవచ్చు గానీ చిప్స్, బేకరీ పదార్థాల్లోనూ నూనె, కొవ్వులు ఉంటాయన్న సంగతి మరవరాదు.

* వేపుళ్లు తినకపోవటమే మంచిది. అంతగా తినాలని అనిపిస్తే వారానికి ఒకసారి తినొచ్చు. అదీ తక్కువగానే తినాలి.

బరువు అదుపు కీలకం

మధుమేహానికి ప్రధాన ముప్పు కారకాల్లో ఊబకాయం ఒకటి. గమనించాల్సిన విషయం ఏంటంటే- దీన్ని మార్చుకోగలిగే అవకాశముండటం. ముందస్తు మధుమేహంలోనూ.. అంటే త్వరలో పూర్తిస్థాయి మధుమేహంగా మారే దశలో బరువు తగ్గినా రక్తంలో గ్లూకోజు స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇలా మధుమేహంగా మారటాన్ని ఆలస్యం చేసుకోవచ్చు.

* మధుమేహం తలెత్తి చాలా కాలమైనా కూడా గ్లూకోజు నియంత్రణ, మందుల మోతాదు విషయంలో బరువు గణనీయమైన పాత్ర పోషిస్తుంది. శరీర బరువులో కనీసం 5% బరువు తగ్గినా ఆరోగ్యం గణనీయంగా మెరుగవుతుంది. ఎంత ఎక్కువ బరువు తగ్గితే అంత మంచి ఫలితం కనిపిస్తుంది. 

* శరీర సామర్థ్యాన్ని బట్టి నడక, పరుగు, ఈత వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయటం.. మితిమీరి తినకపోవటం వంటి వాటి ద్వారా బరువు పెరగకుండా చూసుకోవచ్చు. 

ఇతర జబ్బులపై కన్ను

రక్తంలో గ్లూకోజు దీర్ఘకాలంగా నియంత్రణలో లేకపోతే రకరకాల దుష్ప్రభావాలకు దారితీస్తుంది. గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహ కంటి జబ్బు (రెటినోపతీ), శుక్లాలు, నీటికాసులు, నాడులు దెబ్బతినటం, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి. రకరకాల క్యాన్సర్ల ముప్పూ పెరగొచ్చు. వీటిని నివారించుకోవటం చాలా చాలా ముఖ్యం.

* మాత్రలు లేదా ఇన్సులిన్‌ వంటి మందులన్నీ క్రమం తప్పకుండా, డాక్టర్‌ సూచించినట్టుగా తీసుకోవాలి.

* గ్లూకోజు మోతాదులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. అనూహ్యమైన తేడాలేవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

* వేళకు భోజనం చేయాలి. భోజనం మానెయ్యరాదు. వ్యాయామం మరవరాదు.

* క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.  

అవసరమైతే దూర వైద్యం

ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంట్లోంచే డాక్టర్‌ను సంప్రదించే వెసులుబాటు చాలాకాలం నుంచీ ఉంది. కరోనా విజృంభణతో ఇది మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫోన్, ఇ-మెయిల్, వీడియో సంభాషణ వంటివన్నీ ఇప్పుడు మామూలు విషయాలుగానూ మారిపోయాయి. మధుమేహ నియంత్రణలో క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించటం కీలకం. అందువల్ల వీలైనంతవరకు ఇలాంటి దూర వైద్య సదుపాయాలను వాడుకోవటం మంచిది.

* అనుసంధాన గ్లూకోమీటర్లు, నిరంతరం గ్లూకోజు మోతాదులను పర్యవేక్షిస్తూ అవసరమైనంత మేరకు ఇన్సులిన్‌ను ఇచ్చే పంపుల వంటివీ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చాలా పరికరాలు స్మార్ట్‌ఫోన్‌తో  అనుసంధానమై, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంటాయి కూడా. దీన్ని నేరుగా డాక్టర్‌కూ పంపించుకోవచ్చు. డాక్టర్‌ ఏదైనా ప్రమాదాన్ని అనుమానిస్తే వెంటనే అప్రమత్తం చేయటానికి, అవసరమైతే మందుల మోతాదు మార్చాలని సూచించటానికీ దీంతో వీలుంటుంది. 

* మందులు మరచిపోకుండా వేసుకునేలా, సమయానికి పరీక్షలను చేసుకోవాలంటూ గుర్తుచేసే యాప్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరికరాలు మరింత బాగా గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటానికి, అవసరమైతే మందుల మోతాదులను మార్చుకోవటానికి, అనవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితిని తప్పించుకోవటానికి కూడా ఉపయోగపడుతున్నాయి. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని