
AP News: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక ముందడుగు!
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా మరో ముందడుగు వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్లైన్లోనే పంపి వారి ఆమోదం తీసుకుంది. ఇదే సమయంలో సీఎస్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు.
మరోవైపు, 1974 చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సమర్పించిన నివేదికను సమీర్ శర్మ కలెక్టర్లకు పంపారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామంటూ గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్ పాదయాత్ర సందర్భంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.