Gujarat: బాలుడిని కిడ్నాప్‌ చేస్తున్నారా?.. ఆ తల్లిదండ్రులకు విచిత్ర అనుభవం!

గుజరాత్‌లో ఓ తల్లిదండ్రులకు విచిత్ర అనుభవం ఎదురైంది. తమ కుమారుడితో కలిసి ప్రయాణిస్తుండగా.. అతన్ని కిడ్నాప్‌ చేశారేమోనని అనుమానించిన స్థానికులు వారిని అడ్డుకోవడం గమనార్హం. చివరకు పోలీసులు.. ఆ దంపతుల ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నిర్ధారించుకోవడంతో కథ సుఖాంతమైంది.

Published : 12 Oct 2022 01:14 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో ఓ తల్లిదండ్రులకు విచిత్ర అనుభవం ఎదురైంది. తమ కుమారుడితో కలిసి ప్రయాణిస్తుండగా.. అతన్ని కిడ్నాప్‌ చేశారేమోనని అనుమానించిన స్థానికులు వారిని అడ్డుకోవడం గమనార్హం. చివరకు పోలీసులు.. ఆ దంపతుల ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నిర్ధారించుకోవడంతో కథ సుఖాంతమైంది. వడోదరకు చెందిన ఓ జంట సోమవారం తమ ఐదేళ్ల కుమారుడితో కలిసి ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో వెళ్తున్నారు. అప్పటికే ఆ బాలుడు పెద్దగా అరుస్తూ.. వారితో గొడవపడుతున్నాడు. ఇది గమనించిన మార్కెట్‌లోని స్థానికులు వెంటనే వారి వాహనాన్ని అడ్డుకున్నారు.

‘బాలుడిని కిడ్నాప్‌ చేస్తున్నారా?’ అని గట్టిగా ప్రశ్నించడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు! అప్పటికే పెద్దఎత్తున జనం గుమిగూడారు. అతను తమ కుమారుడేనని వివరించేందుకు దంపతులు యత్నించారు. అయితే, బాలుడు బధిరుడు కావడంతో.. ఏం మాట్లాడలేదు. దీంతో.. జనాలు వారిని నమ్మలేదు. ఒకవైపు పిల్లల కిడ్నాప్‌లపై పుకార్లు, మరోవైపు బాలుడి ప్రవర్తన.. వారిలో అనుమానాన్ని మరింత పెంచాయి. వెంటనే పోలీసులను సంప్రదించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకూ.. తల్లిదండ్రులు ఇదే విషయం చెప్పారు. తగిన ఆధారాలు చూపాలని కోరడంతో.. అంతా కలిసి ఇంటికెళ్లారు. ఆధార్‌, ఇతర డాక్యుమెంట్‌లతో వివరాలను నిర్ధారించుకున్నారు. ఈ ప్రక్రియకు మొత్తం రెండు గంటల సమయం పట్టింది.

‘ఈ వ్యవహారంపై బాలుడి తల్లిదండ్రులు కలత చెందారు. ప్రజలు అలాంటి ఆరోపణ ఎలా చేస్తారని వాపోయారు. కానీ, పిల్లవాడు బధిరుడు కావడంతో ఏం చేయలేకపోయారు. అయితే.. ఇటువంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, పోలీసులను పిలవడం మంచి సంకేతమని వారికి వివరించాం. ఇటువంటి చర్యలతో అసలైన కిడ్నాప్‌లనూ అడ్డుకోవచ్చు’ అని స్థానిక ఏసీపీ మేఘా తేవర్ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని