kids: మీ పిల్లలు ప్రతి దానికి భయపడుతున్నారా! కారణాలేంటో తెలుసుకోండి!

పిల్లలు చిన్న విషయాలకు ఆనందిస్తుంటారు. అలాగే చిన్న విషయాలకు భయపడుతూ ఉంటారు. ఈ భయం కొంత మేరకు ఉంటే ఫరవాలేదు. కానీ కొంతమంది పిల్లలు ప్రతి దానికి భయపడుతుంటారు. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. 

Published : 10 Oct 2022 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు చిన్న విషయాలకు ఆనందిస్తుంటారు. అలాగే చిన్న విషయాలకు భయపడుతూ ఉంటారు. ఈ భయం కొంత మేరకు ఉంటే ఫరవాలేదు. కానీ కొంతమంది పిల్లలు ప్రతి దానికి భయపడుతుంటారు. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. 
జన్యుపరంగా.. 
కొంతమంది పిల్లలు అందరితో కలవడానికి ఇష్టపడరు. ఇతర పిల్లల్లా చురుకుగా ఉండరు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇలాంటివి ఉంటే ఆ లక్షణం పిల్లల్లో రావటం సహజం. సహజంగా వచ్చే అలవాటే అయినా తల్లిదండ్రులు కాస్త సమయం కేటాయించుకుని పిల్లలను భయాల నుంచి దూరం చేయవచ్చు.

తల్లిదండ్రుల అతి ప్రేమ..
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో వాళ్లని గారాబం చేస్తుంటారు. పిల్లలు నడక నేర్చుకునే దగ్గర నుంచి స్కూల్‌కి వెళ్లే వయస్సుకు వచ్చినా వాళ్లని స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించరు. పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని అన్ని విషయాలను తమ పర్యవేక్షణలోనే చేయించాలనే ఆలోచన విధానం కలిగి ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. 

పిల్లల్ని పట్టించుకోకపోవడం..
పనుల్లో పడి కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు. దీంతో పిల్లలు ఒంటరి తనాన్ని అనుభవిస్తారు. క్రమంగా అన్నింటిల్లోనూ వెనుకపడిపోతారు. ప్రతిదానికి వారిలో భయం మొదలవుతుంది. 

పిల్లల్లో భయం పోగొట్టాలంటే ఏం చేయాలి..

* పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలి.  వాళ్ల ఆలోచనలు, అవసరాలు, ఇష్టాలు పంచుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. 

* ప్రతి విషయాన్ని సొంతంగా తెలుసుకునే విధంగా ప్రోత్సహించండి. దీంతో ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మరోసారి ఆ పనిని ఎలా సంపూర్ణంగా చేయాలో ఆలోచించుకోగలుగుతారు. 

* పిల్లలు ఏదైనా తప్పు చేసినా, అబద్ధాలు చెప్తే వాళ్ల మీద అరవటం, తిట్టడం, కొట్టడం చేయకండి. ఇలా చేయడం వల్ల పిల్లలు మీ దగ్గర అన్ని విషయాలు మాట్లాడేందుకు భయపడతారు. 

* పిల్లలు ఏఏ విషయాల్లో భయపడుతున్నారో గమనించండి. వారితో ప్రేమగా మాట్లాడండి. వాళ్ల భయానికి కారణం ఏంటో తెలుసుకోండి. వారికి అర్థమయ్యే విధంగా పరిస్థితిని వివరించండి. 

* మార్కుల విషయంలోనైనా, వ్యక్తిత్వం విషయంలోనైనా ఇతర పిల్లలతో వాళ్లను పోల్చకూడదు. ఇలా చేస్తే పిల్లల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఒకవేళ మీ పిల్లల పద్ధతి బాగలేదంటే వారితో కూర్చుని మాట్లాడండి. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకోండి. 

* మీరు మీ పిల్లలకు ఏ విషయంలోనైనా ‘నో ’ చెప్పినపుడు ఎందుకు వద్దంటున్నారో వివరంగా తెలియజేయండి. 

* పిల్లలు ఏం చేసినా మీ మాట వినకుండా ఉన్నట్లైతే పిల్లల మానసిక వైద్య నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని