Kids Homework: మీ పిల్లలు సరిగా హోం వర్క్‌ చేస్తున్నారా!

పిల్లలు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. చదవటం, రాయడం వంటివి చేసేందుకు ఇష్టపడరు. కానీ హోం వర్క్‌ చేయడం తప్పనిసరి కదా. మరి వాళ్లతో ఎలా చేయించాలి..?

Published : 16 Oct 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ పిల్లలు హోం వర్క్‌ అంటే సాకులు వెతుకుతున్నారా! ఈ అనుభవం చాలామంది పేరెంట్స్‌కి ఎదురయ్యే ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. చదవటం, రాయడం వంటివి చేసేందుకు ఇష్టపడరు. కానీ హోం వర్క్‌ చేయడం తప్పనిసరి కదా. మరి వాళ్లతో ఎలా చదివించాలి? 

* పిల్లలను తిట్టి, కొట్టి హోం వర్క్‌ చేయించాలనే ఆలోచన మానుకోండి. దీనివల్ల వాళ్లు మొండిగా తయారవుతారు. చాలామంది పిల్లలు హోం వర్క్‌ పేరు తీయగానే.. ఆడుకున్న తరవాత చేస్తాం, తిన్నాక చేస్తాం, ఉదయం నిద్ర లేచిన తరవాత చేస్తాం.. అంటూ రకరకాల సాకులు చెబుతుంటారు. వెంటనే వాళ్ల మీద అరవటం వంటివి చేయకండి. 

* స్కూల్‌ నుంచి రాగానే వాళ్లకు స్నాక్స్‌ పెట్టండి. స్కూల్‌లో జరిగిన విషయాల గురించి వాళ్లతో చర్చించండి. చేయించాల్సిన హోం వర్క్‌ ఏముందో చూడండి. తక్కువగా ఉన్న పనిని ముందుగా పూర్తి చేయాలని చెప్పండి. కాస్త సమయం ఎక్కువ తీసుకునే పనులను మెల్లగా చేయించండి. హోం వర్క్‌ అంతా పూర్తి చేసిన తరవాత పిల్లలు ఆడుకోవటానికి సమయం ఉండదు అనే ఆలోచనలో ఉంటుంటారు. వాళ్లని ఇంట్లోనే ఉండాలనే షరతులు విధించకండి. ఆటలు ఆడుకునేందుకు బయటకు పంపించండి. దీంతో వాళ్ల శరీరానికి అవసరమయ్యే వ్యాయామం ఆటల ద్వారా చేసేస్తారు. 

* పిల్లలు బట్టి పట్టి చదవకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా తల్లి ఎక్కువ సమయం పిల్లలతో ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల హోం వర్క్‌లో సైన్స్‌ ప్రాజెక్టులు చేయాల్సి వస్తే.. కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలకు నేర్చించాలి. పిల్లలకు యాంత్రికంగా కాకుండా ఆ సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా వివరించి చెప్పండి. 

* పిల్లల్లో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికి తీయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. పిల్లలు ఏఏ విషయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఏఏ సబ్జెక్టుల్లో వెనుకపడ్డారో గమనించాలి. 

* కొంతమంది పేరెంట్స్ పిల్లల హోం వర్క్‌ గురించి ఆలోచించరు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పిల్లలకు స్కూల్లో ఎలాంటి హోం వర్క్‌ ఇస్తున్నారు? పిల్లలు సకాలంలో పూర్తి చేస్తున్నారా? లేదా అనే విషయాలను తల్లిదండ్రులు పట్టించుకోవాలి. 

*పిల్లలతో కలిసి యాక్టివిటీస్‌ చేయండి. స్కూల్లో యాక్టివిటీలు ఇస్తుంటారు. వీటిని పిల్లలకు ఎలా చేయాలో తల్లిదండ్రులు దగ్గరుండి చేయించాలి. వీటికి సంబంధించిన వస్తువులను వారికి కొనివ్వండి. 

*  పిల్లలు హోం వర్క్‌ చేయకుంటే స్కూల్లో టీచర్లు తమ పిల్లల్ని కొడతారని కొంతమంది వాళ్ల  తల్లులే చేసేస్తుంటారు. ఇలా ఎంతమాత్రం చేయకూడదు. దీంతో పిల్లలు హోం వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపించరు. వాళ్లు మా అమ్మ చేసేస్తుందిలే అనే భావనలోకి వస్తారు. 

 పిల్లల మీద కోపం చూపిస్తే వాళ్లు మొండికేస్తారు. అందువల్ల ప్రేమతోనే వాళ్లకు దగ్గరవ్వండి. కఠినంగా ఉండకండి. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉండేటట్లు చూడండి. వాళ్లతో మనసు విప్పి మాట్లాడండి. దీంతో వాళ్లకు కలిగే ప్రతి ఆలోచనను మీతో పంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని