Kids: మీ పిల్లలు ఫోన్లు వదలడం లేదా? ఇలా చేయండి!

కరోనాతో అందరూ ఇంటి పట్టున ఉన్నారు. దీంతో పిల్లల నోరు మూయించాలని ఫోన్లు అందించారు తల్లిదండ్రులు. అంతలోనే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి.

Published : 18 Sep 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాతో అందరూ ఇంటి పట్టున ఉన్నారు. దీంతో పిల్లల నోరు మూయించాలని ఫోన్లు అందించారు తల్లిదండ్రులు. అంతలోనే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని స్మార్ట్‌ఫోన్లు వచ్చేసాయి. దీంతో పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేదెలా అని ఆలోచిస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి. 
 

ముందు మీరు మానేయండి..

తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం మానుకోవాలి. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవడం, కబుర్లు చెప్తూ ఉంటే పిల్లలు  కూడా అదే విధానం కొనసాగిస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. 

మీ పర్యవేక్షణలోనే ఉండేటట్లు..

పిల్లలు టీవీ, ఫోన్లను వాడుతున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండండి. మీ పర్యవేక్షణలోనే  వాళ్లు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి. ఏదైనా సినిమా అయినా, షోలు అయినా పిల్లలతో కలిసి మీరూ చూడండి. కేవలం వినోదం కోసం కార్టూన్‌ బొమ్మలు కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని విజ్ఞానం అందించే విషయాలను పిల్లలకు తెలియజేయండి. 
 

* మీరూ మరింత తెలుసుకోండి..

 రోజు రోజుకీ పిల్లలు విజ్ఞానవంతులు అవుతున్నారు. నేటితరం పిల్లలకు టెక్నాలజీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే తెలుసు అని చెప్పాలి. అందువల్ల తల్లిదండ్రులకు ఏం తెలియదు అనుకుంటే పిల్లలు తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మీ పిల్లలకు ప్రతి విషయం గురించి తెలుసుకుని చెప్పాలి. దీంతో వారి మీ మీద గౌరవం కూడా పెరుగుతుంది. 
 

* ప్రత్యామ్నాయం ఆలోచించండి!

పిల్లలు కాస్త అల్లరి చేయగానే, ఏడుపు ఆపడానికి ఫోన్‌ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్‌ తీసుకోవాలనే ఆలోచనా ధోరణి పెరుగుతుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి.

* నిర్ణీత సమయంలోనే...

ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడుకునేందుకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. ఇంట్లో అందరూ ఆ సమయంలో తమ తమ పనులు పూర్తి చేసుకోవాలనే నిబంధన పెట్టండి. ఆ తరవాత అందరూ కలిసి ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకునే విధానం అలవడుతుంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని