ఆ రాజుల మరణాలకు విచిత్ర కారణాలు

చరిత్రలో ఎందరో చక్రవర్తులు ఏళ్ల తరబడి రాజ్యాలను పాలించారు. రాజభోగాలను అనుభవిస్తూ.. రాజ్యవిస్తరణకు పాటుపడుతూ గొప్ప పాలనను అందించారు. కానీ రాజుల ప్రాణాలు ఎప్పుడు, ఎలా పోతాయో చెప్పలేం. కొందరు రాజులు యుద్దాల్లో వీరమరణం

Updated : 03 Sep 2020 18:46 IST

చరిత్రలో ఎందరో చక్రవర్తులు ఏళ్ల తరబడి రాజ్యాలను పాలించారు. రాజభోగాలను అనుభవిస్తూ.. రాజ్యవిస్తరణకు పాటుపడుతూ గొప్ప పాలనను అందించారు. కానీ రాజుల ప్రాణాలు ఎప్పుడు, ఎలా పోతాయో చెప్పలేం. కొందరు రాజులు యుద్ధాల్లో వీరమరణం పొందితే.. మరికొందరు వృద్ధాప్యంతో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంకొందరు రాజులు మూర్ఖత్వంతో, వింత కారణాలతో మృతి చెందారు. ఎవరా రాజులు? ఎలా చనిపోయారు? తెలుసుకుందాం పదండి..


పాదరసం తాగి...

క్రీస్తు పూర్వం 247 నుంచి 221 మధ్య చైనాలో కిన్‌ సామ్రాజ్యం ఉండేది. కిన్‌ రాజవంశంలో ఒకడైన కిన్‌ షి హుహాంగ్‌ ఉమ్మడి చైనాకు తొలి చక్రవర్తి. తాను సింహాసనం అధిష్ఠించిన తర్వాత అమరత్వంతో ఉండాలనుకున్నాడు. ఇందుకోసం ప్రయోగాలు చేయించాడు. ఈ క్రమంలో పాదరసం తాగడు. అంతే.. అమరత్వం కోసం ప్రయత్నించి ఉన్న జీవితాన్ని కోల్పోయాడు. పాదరసం తాగడంతో కిన్‌ మృతి చెందాడు. 


సింహాసనం కూలి...

 హంగేరిని క్రీస్తు శకం 1060 కాలంలో బెలా-I అనే చక్రవర్తి పరిపాలించాడు. రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించిన మూడేళ్లకే సింహాసనమే ఆయనకు మరణశాసనం అయ్యింది. 1063 సెప్టెంబర్‌లో ఓ రోజు బెలా తన సింహాసనంలో కూర్చోగానే ఆ సింహాసనం కుప్పకూలింది. దీంతో చక్రవర్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ కొన్ని రోజులకు కన్నుమూశాడు.


సొంత సైనికుడి బాణం గుచ్చుకొని

క్రీస్తుశకం 1087 - 1100 మధ్య ఇంగ్లాండ్‌ను విలియమ్‌-II పరిపాలన సాగించాడు. ఆయనకు వేటాడటం అంటే మహా ఇష్టం. ఆగస్టు 2, 1100న బ్రోకన్‌హర్ట్స్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తన అంగరక్షకులతో వేటకు వెళ్లాడు. తన సైనికుల్లో ఒకరు మృగానికి సంధించిన బాణం నేరుగా విలియమ్‌కు గుచ్చుకుంది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


కోతి దాడితో...

1917లో 24ఏళ్ల వయసులోనే అలెగ్జాండర్‌(అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ కాదు) గ్రీస్‌కు రాజయ్యాడు. అందరి మన్ననలు అందుకున్నాడు. కానీ చక్రవర్తిగా మారిన మూడేళ్ల తర్వాత ఓ కోతి దాడిలో మరణించాడు. 1920 అక్టోబర్‌ 2న అలెగ్జాండర్‌ తన ఎస్టేట్‌లో నడుస్తుండగా ఓ కోతి.. శునకంపై దాడి చేసింది. ఆ రెండింటిని నిలువరించే ప్రయత్నం చేస్తున్న అలెగ్జాండర్‌పై మరో కోతి దాడి చేసి కాలిని కొరికింది. దీంతో కాలికి పెద్ద గాయమే అయింది. అయినా చక్రవర్తి ఆ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గాయం తీవ్రమై అదే నెలలో 25న మృతి చెందాడు.


అతి తిండి కారణంగా.. 

18వ శతాబ్దంలో స్వీడెన్‌ను అడల్ఫ్‌ ఫ్రెడ్రెరిక్‌ అనే రాజు పరిపాలించాడు. పాలన ఆయనకు చేతకాకపోయినా... వ్యక్తిగతంగా మాత్రం మంచి పేరు సంపాదించాడు. అడాల్ఫ్‌ భోజన ప్రియుడు. నచ్చిన ఆహారాన్ని ఎంతైనా లాగించేసేవాడు. 60 ఏళ్ల అడాల్ఫ్‌ ఎప్పటిలాగే 1771 ఫిబ్రవరి 12న చేపలు, ఎండ్రకాయ కూరలు, క్యాబేజీ కూరతో భోజనం చేశాడు. అవి సరిపోలేదని కేకులు, స్వీట్లు తిన్నాడు. ఆపై మద్యం సేవించాడు. దీంతో అతడి కడుపు నిండిపోయింది. జీర్ణ సమస్య తలెత్తి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 


తెగిన తల వల్ల 

క్రీ.శ 875-892 మధ్య నొర్స్‌ ప్రజలకు సిగర్డ్‌ ఆఫ్‌ మైటీ అనే యోధుడు నాయకుడిగా ఉండేవాడు. స్కాట్లాండ్‌కు చెందిన వీరికి స్వదేశంలోనే మీల్‌బ్రిగ్డ్‌ అనే మరో నాయకుడితో వైరం ఏర్పడింది. దీంతో ఇరువైపు నుంచి 40 మంది చొప్పున సైనికులతో యుద్ధం చేయాలని ఒప్పందం చేసుకున్నారు. కానీ సిగర్డ్‌ ఒప్పందం మీరి 80 మందిని తీసుకెళ్లి యుద్ధంలో విజయం సాధించాడు. మీల్‌ బ్రిగ్డ్‌ తల నరికి దానికి గుర్రానికి కట్టి తిరిగి పయనవుతుండగా.. మీల్‌ బ్రిగ్డ్‌ పన్ను సిగర్డ్‌ కాలుకు గుచ్చుకుంది. అది కాస్త విషపూరితంగా మారి ఆఖరికి యోధుడి ప్రాణాలు తీసింది.


దారం కత్తిరించబోయి...

14వ శతాబ్దంలో యూరప్‌లోని నవార్రె ప్రాంతాన్ని ఛార్లెస్-II పరిపాలించాడు. 54 ఏళ్ల వయసులో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స తీసుకుంటూ మృతి చెందితే సాధారణంగానే ఉండేది.. కానీ ఈయన మృతి చాలా విచిత్రంగా జరిగింది. అందుకే ఇప్పటికీ యూరప్‌లో ఆయన మృతిపై మాట్లాడుకుంటుంటారు. ఛార్లెస్‌-II అస్వస్థతకు గురికావడంతో అతడి నెత్తి నుంచి కాలిగోరు వరకు మొత్తాన్ని మద్యంలో నానబెట్టిన బట్టతో చుట్టాలని వైద్యుడు సూచించాడు. దీంతో అంతఃపురంలో ఉండే పనిమనిషి రాజును బట్టతో చుట్టి దారం ముడివేసి కత్తిరించాలని భావించింది. ఆ సమయంలో కత్తెర కనపడకపోవడంతో కొవ్వొత్తిని వెలిగించి ఆ మంటతో దారం కత్తిరించేందుకు ప్రయత్నించింది. కానీ ఆ మంటలు బట్టకు అంటుకొని ఛార్లెస్‌ II అగ్నికి ఆహుతయ్యాడు. 


పుట్టగొడుగు తిని..

యూరప్‌లో 1438-1806 మధ్య హబ్స్‌బర్గ్‌ రాజ్యం ఉండేది. 1685 నుంచి 1740 వరకు ఛార్లెస్‌-VI పాలన సాగించాడు. విజయవంతంగా ఎన్నో రాజ్యాలను స్వాధీనం చేసుకొని విజయభేరి మోగించాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజుగా పేరు సంపాదించాడు. అయితే 1740లో అక్టోబర్‌లో ఓ రోజు హంగేరి సరిహద్దులో వేటకు వెళ్లి అక్కడి నుంచి వియన్నాకు వెళ్లాడు. ఈ మధ్యలో ఛార్లెస్‌-VI విషపు పుట్టగొడుగులను తిన్నాడట. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన అదే నెలలో 20న ప్రాణాలు కోల్పోయాడు. విషపు పుట్టగొడుగులు తినడం వల్లే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.


తలుపునకు గుద్దుకొని కోమాలోకి వెళ్లి..

ఛార్లెస్‌-VIII 13 ఏళ్ల వయసులోనే ఫ్రాన్స్‌కు చక్రవర్తి అయ్యాడు. 1483లో రాజుగా మారినా విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లి తిరిగి 21 ఏళ్ల వయసులో సింహాసనం అధిష్ఠించాడు. అయితే 1498లో ఛార్లెస్-‌VIII టెన్నిస్‌ క్రీడ ఆడుతుంటే చూడటానికి ఆతృతగా వెళ్తూ తలుపును గుద్దుకున్నాడు. అయినా ఏం పట్టనట్టు వెళ్లి క్రీడను వీక్షించాడు. తిరిగి రాగానే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.


ఫిరంగి వెనక్కి పేలి

జేమ్స్‌-II 1437 నుంచి 1460 వరకు స్కాట్లాండ్‌ను పరిపాలించాడు. జేమ్స్‌కు ఫిరంగులంటే ఇష్టం. దీంతో తన సైన్యంలోకి ఫిరంగులను దిగుమతి చేయించుకునేవాడు. ఆగస్టు 3, 1460న దిగుమతి చేసుకున్న ఫిరంగుల వద్ద నిలబడి అవి ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలనుకున్నాడు. ఓ ఫిరంగిలో గుండు పెట్టి పేల్చగానే అది వెనక్కి పేలి జేమ్స్‌-II తోడ రెండు ముక్కలైంది. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు.  

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు