Telangana News: ‘హునర్‌ హాట్‌’లో దేశ ఐక్యత కనిపిస్తోంది: కిషన్‌రెడ్డి

వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం హూనర్‌ హాట్‌ కార్యక్రమం చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 27 Feb 2022 15:10 IST

హైదరాబాద్‌: వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం హూనర్‌ హాట్‌ కార్యక్రమం చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శన(హునర్‌ హాట్‌)ను మరో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే రఘనందన్‌రావు పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని కిషన్‌రెడ్డి వివరించారు. కార్యక్రమం మార్చి 6వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. 30 రాష్ట్రాల నుంచి 700మంది కళాకారులు హాజరయ్యారని తెలిపారు.

‘‘హునర్‌ హాట్‌లో భారతదేశ ఐక్యత కనిపిస్తోంది. కొందరు లఖ్‌నవూ నుంచి.. మరికొందరు భోపాల్‌ నుంచి వచ్చారు. ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కరోనా కారణంగా చిన్నచిన్న పనులు చేసుకునే వారు, శిల్పకారులు, కళాకారులు ఎందరో ప్రభావితం అయ్యారు. రెండేళ్లుగా వారు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ లేదు. ఇందుకే మైనార్టీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 75చోట్ల హూనర్‌ హాట్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మాట్లాడుతూ.. ‘‘హునర్‌ హాట్‌ కార్యక్రమం వెనుక ఓ ఆలోచన, సంకల్పం ఉన్నాయి. శిల్పకారులు, చేతివృత్తిదారుల, కళాకారుల వారసత్వ కళలకు మార్కెటింగ్‌ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. మరోవైపు స్వదేశీ కళల స్వావలంబన సాధించేందుకు ఇది ఒక ప్రభావవంతమైన కార్యక్రమం. శిల్పకారులు, చేతివృత్తిదారుల, కళాకారుల సంరక్షణ ప్రోత్సాహానికి హునర్‌ హాట్‌ భాగస్వామ్యం అవుతుంది’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని