Vijayawada: హైదరాబాద్‌కు రైళ్లలో వచ్చే ఏపీ ప్రజల కోసం న్యూ రైల్వే టెర్మినల్‌: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌కు రైళ్లలో వచ్చే ఏపీ ప్రజల సౌకర్యం కోసం నగరశివారులోని చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టెర్మినల్‌ కడతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.

Updated : 14 Feb 2023 19:07 IST

విజయవాడ: ఏపీలో రైల్వే ప్రాజెక్టుల కోసం గత బడ్జెట్‌లో కంటే ఈసారి 20శాతం అధికంగా నిధులు కేటాయించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 58 కి.మీ మాత్రమే కొత్త లైన్లు వేస్తే.. మోదీ ప్రభుత్వ హయాంలో 350 కి.మీ కొత్త లైన్లు వేశామని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే విభాగానికి  బడ్జెట్‌లో రూ.8,600 కోట్లు కేటాయించారని తెలిపారు. మచిలీపట్నం వరకు పొడిగించిన ధర్మవరం-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలును విజయవాడలో రైల్వేస్టేషన్‌లో జెండాఊపి ఆయన ప్రారంభించారు. మరి కొన్ని రైళ్లను పొడిగిస్తున్నట్టు చెప్పారు. విజయవాడ విమానాశ్రయం మాదిరిగా రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. డీపీఆర్‌ సిద్ధమయ్యాక పనులు చేపడతామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

హైదరాబాద్‌కు రైళ్లలో వచ్చే ఏపీ ప్రజల సౌకర్యం కోసం నగరశివారులోని చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టెర్మినల్‌ కడతామని కిషన్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడ-హుబ్బళీ ఎక్స్‌ప్రెస్‌ నర్సాపురం వరకు, విజయవాడ-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ మచిలీపట్నం వరకు, విశాఖ-కాచిగూడ రైలును మహబూబ్‌నగర్‌ వరకు, విశాఖ-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరు వరకు, నంద్యాల-కడప ఎక్స్‌ప్రెస్‌ను రేణిగుంట వరకు పొడిగిస్తామని తెలిపారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య త్వరలో వందేభారత్‌ రైలు వచ్చే అవకాశముందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని