Telangana News: ఆ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవాన్ని నిర్వహించారు.

Published : 01 May 2022 14:11 IST

హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టాలీవుడ్‌ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి, మరికొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మిగతా రంగాలతో పోల్చితే పర్యాటక, సినీ రంగం ఎంతో నష్టపోయింది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామనంటే అది కేవలం కరోనా వ్యాక్సిన్‌ వల్లే సాధ్యపడింది. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూసే విధంగా ఒక ఉత్తమమైన వ్యాక్సిన్‌ను మనం రూపొందించుకున్నాం.

దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. అందులో 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారు. మరో 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో కొనసాగుతున్నారు. సంఘటిత రంగంలోని కార్మికులు మాత్రమే పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు పొందుతున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. వారు పొందాల్సిన కనీస హక్కులు సైతం పొందలేకపోతున్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. పనికిరాని చట్టాల్లో సవరణలు చేస్తూ.. 29 చట్టాలు ఉంటే ఇవాళ వాటిని 4కు తీసుకొచ్చాం. తెలుగు కార్మిక రంగానికి సంబంధించి సామాజిక భద్రత కోడ్‌ (సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌) చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం తప్పకుండా సినిమా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉపయోగపడుతుంది’’ అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని