Finger Pain: టైపింగ్‌తో వేళ్లు నొప్పెడుతున్నాయా..? ఉపశమనం పొందండిలా!

ఎక్కువసేపు కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేయడం వల్ల చేతివేళ్లపై ఒత్తిడి పెరిగి నొప్పిపెడుతుంటాయి. మరీ ఈ నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం. 

Updated : 17 Jan 2022 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌తో గత రెండేళ్లుగా ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్‌, మొబైల్‌, ల్యాప్‌టాప్‌ లేనిదే పని సాగని పరిస్థితి. అయితే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని మొబైల్‌, ల్యాప్‌టాప్‌లలో టైప్ చేస్తుండటంతో చేతులు, భుజాలు, వెన్నెముక వంటి శరీరభాగాలపై ఒత్తిడి పెరగడంతోపాటు కంటి సమస్యలు కూడా తలెత్తున్నాయట. మరీ ముఖ్యంగా చేతి వేళ్లు ఎక్కువగా నొప్పిపెడుతున్నట్లు పలువురు తెలిపారు. అయితే చేతి వేళ్లపై ఒత్తిడి తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకుందాం.

💻 పనిలో పడిపోతే కొంతమంది సమయం గురించి పట్టించుకోరు. గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చుండిపోయి పనిచేస్తుంటారు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కనీసం ప్రతి గంటకోసారి చిన్న బ్రేక్ తీసుకోమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

💻 బ్రేక్‌ సమయంలో చేతి వేళ్లని చాచుతూ ఉండాలి. అలానే పిడికిలి మూస్తూ, తెరుస్తూ కొద్ది సెకన్లు చేయడం వల్ల చేతి వేళ్లపై ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. 

💻 మనం కూర్చుకునే పద్ధతి వల్ల కూడా చేతి వేళ్లపై ప్రభావం ఉంటుందట. టైప్‌ చేయడానికి ఇబ్బందికరంగా లేనిచోటులో మనం ఉపయోగించే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ను ఉంచడంతోపాటు, అందుకు అనువైన టేబుల్‌, కుర్చీని ఎంచుకోమని సూచిస్తున్నారు.

💻 కొన్నిసార్లు మంచంపై కూర్చుని లేదా పడుకుని పనిచేస్తుంటాం. దానివల్ల చేతులపై ఒత్తిడి పెరిగి వేళ్లు నొప్పి పెడుతుంటాయి. అందుకే చేతివేళ్లపై భారం పడకుండా ఉండాలంటే మనం సరైన పద్ధతిలో కూర్చుని పనిచేయడం ఎంతో ముఖ్యం. వీటితోపాటు చేతి వేళ్లపై మెల్లగా మసాజ్‌ చేయడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని