మంచుబిందువులు తెచ్చిన ఫోటోగ్రఫీ అవార్డు..

కొల్హాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆపిల్ సంస్థ నుంచి ఫోటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే...  ప్రముఖ దిగ్గజ సంస్థ ఆపిల్‌ తన ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పడానికి రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది.

Published : 15 Apr 2022 01:23 IST

కొల్హాపూర్‌: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆపిల్ సంస్థ నుంచి ఫోటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే...  ప్రముఖ దిగ్గజ సంస్థ ఆపిల్‌ తన ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పడానికి రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇటీవల 'షాట్ ఆన్ ఐఫోన్' పేరుతో ఫొటోగ్రఫీ పోటీని నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 16 వరకు పోటీలు జరిగాయి. ఇందులో కస్టమర్లు వారి ఐ ఫోన్‌13 ప్రో, ఐ ఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లతో చిత్రాలను తీయాల్సి ఉంటుంది. చైనా, ఇటలీ, స్పెయిన్, థాయ్‌లాండ్, అమెరికాకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరు పంపిన వాటిల్లో 10 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి  విజేతలుగా ప్రకటించారు.

విజేతలలో  కొల్హాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రజ్వల్‌ చౌగులే ఉన్నారు. ‘నాకు ప్రతి రోజు ఉదయం నడకకు వెళ్లడం అలవాటు. అలా నడుస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే అద్భుతాలను ఫొటోలు తీస్తుంటాను. అలా తీసిందే ఈ చిత్రం. సాలెపురుగు గూడుకి మంచు బిందువులు హారంలా అల్లుకున్నాయి. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఆ ఫొటోని ఆపిల్‌ నిర్వహించిన 'షాట్ ఆన్ ఐఫోన్' ఛాలెంజ్‌కు పంపాను. ఉత్తమ 10 చిత్రాల్లో అది ఎంపికవ్వడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ ప్రజ్వల్‌ తన ఆనందాన్ని పంచుకున్నారు. విజేతల ఫొటోలను, వారి దేశాలను ఆపిల్ తన అధికారిక వైబ్‌సైట్‌లలో పొందుపరుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు