KTR: బాసర ఆర్జీయూకేటీలో టీ-హబ్‌ ఏర్పాటు.. 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

ఉన్నత విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవానికి హాజరైన కేటీఆర్.. విద్యార్థులనుద్దేశించి కీలక ఉపన్యాసం చేశారు.

Updated : 10 Dec 2022 13:37 IST

బాసర: ఉన్నత విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవానికి హాజరైన కేటీఆర్.. విద్యార్థులనుద్దేశించి కీలక ఉపన్యాసం చేశారు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదవలేదని.. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడే సత్తా సంతరించుకోగలిగితే అపగలిగేవారు ఎవరూ ఉండరన్నారు. పుస్తకాల్లో చదివిన చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. విశ్వవిద్యాలయాల్లో డిజైనింగ్‌ కోర్సులకు రూపకల్పన చేయాలని నిర్దేశించారు.

అంతకుముందు బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించేందుకు టెండర్లు పిలవడం ఏమైనా అంతరిక్ష సమస్యనా? అని అధికారులను ప్రశ్నించారు. గతంలో తాను పర్యటించినప్పుడు విద్యార్థులకు ఇచ్చిన హామీలపై కేటీఆర్‌ ఆరా తీశారు. ఆర్జీయూకేటీలో టీ-హబ్‌ ఏర్పాటకు మంత్రుల సమక్షంలో.. టీ-హబ్‌ ప్రతినిధులు, ఆర్జీయూకేటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఏకరూప దుస్తులు అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని