KTR: ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటు: దావోస్‌లో కేటీఆర్‌

కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ఊతం

Updated : 23 May 2022 17:43 IST

దావోస్‌: కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ఊతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారతదేశంలో కొంత తక్కువ మద్దతు ఉందన్నారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే భారత లైఫ్ లైసెన్స్ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని పేర్కొన్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో లైఫ్ సైన్సెస్ రంగంలో జరిగిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంస్కరణలపై కేటీఆర్ వివరించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటు..

‘‘లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగింది. దీనిని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ని ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ పేరుతో ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదు. భవిష్యత్తులో లైసెన్స్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లైఫ్ సైన్సెస్‌లో హైదరాబాద్ ఇతర నగరాలకంటే ముందుంది. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్ సైన్సెస్ ముందుకు వెళ్తోంది. ఇందుకోసం ఐటీ, ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న నొవార్టీస్‌కు రెండో అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలి..

భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలి. ఎందుకంటే ఈ రంగంలో ఆవిష్కరణలపైన పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్‌తో కూడుకున్నవి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలి. ఈ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న దశాబ్దకాలం పాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మందుల తయారీపైనే కాకుండా నూతన మందులను తయారు చేసే దిశగా కృషి చేస్తే బాగుంటుంది. భారతదేశంలో నైపుణ్యానికి కొదువలేదు. ప్రభుత్వాలు లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలోని ఔత్సాహికులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేస్తుంది’’ అని కేటీఆర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని