
KTR: ఐటీఐఆర్‌పై కేంద్రం పునరాలోచించాలి: కేటీఆర్
హైదరాబాద్: ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీలో తెలంగాణ ముందుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. డిజిటల్ లావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీ వ్యాలెట్‌ను తీసుకొచ్చిందని చెప్పారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ-గవర్నెన్స్‌తో పాటు ఎమ్ (మొబైల్) గవర్నెన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. టీ-యాప్ ద్వారా రోజుకు 270కిపైగా వివిధ ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను పలు ప్రభుత్వ శాఖల పనితీరులో భాగం చేసి సమస్యలు, సవాళ్లకు చెక్ పెట్టామన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా సిటిజెన్ సర్వీసెస్‌ను అందజేస్తున్నామని చెప్పారు. ఫెస్ట్ యాప్ ద్వారా 17 సేవలను రవాణా శాఖ ద్వారా అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత కోసం డిజిటల్ ఇన్ఫాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. దీనికోసం టీ-ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా 30వేల ప్రభుత్వ కార్యాలయాలు, 80లక్షల గృహాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రమని.. ఇతర రాష్ట్రాలతో కలిసి తమ పరిశోధన మూలాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణకు కేటాయించిన ఐటీఐఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని.. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌లకు అదనంగా మరో రెండు ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలను కేటాయించాలన్నారు. స్పేస్ రీసెర్చ్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్‌స్పేస్ సెంటర్‌ను నగరంలో ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.