వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటన

నగరంలోని బైరామల్‌ గూడ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో ...

Updated : 15 Oct 2020 16:48 IST

హైదరాబాద్‌: నగరంలోని బైరామల్‌ గూడ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు. కాలనీల్లో నిలిచిన నీరు త్వరగా పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బైరామల్‌గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులను స్థానికులు.. మంత్రి కేటీఆర్‌, అధికారులకు వివరించారు. ముంపునకు గురైన ఓ నివాసంలోకి వెళ్లి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. ఆ తర్వాత అంబర్‌పేట, రామంతాపూర్‌ చెరువు, హబ్సిగూడలోని వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

మరోవైపు నగరంలోని టోలిచౌకిలోనూ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి టోలిచౌకి నదీంకాలనీలో జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయచర్యలను పర్యవేక్షించారు. షాతం చెరువుకు వరద నీరు వెళ్లాల్సిన నాలా కుంచించుకుపోయిందని.. అందువల్లే నదీంకాలనీకి వరద ముంచెత్తిందని స్థానికులు కేటీఆర్‌కు తెలిపారు. నీట మునిగిన కాలనీల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టోలిచౌకి పర్యటనలో భాగంగా షాతం చెరువును పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కేటీఆర్ వాహనం చెరువు వద్దకు వెళ్ళలేకపోయింది. దీంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన వాహనంలో కేటీఆర్‌ను తీసుకెళ్లి చెరువును పరిశీలించారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు