ఆంగ్ల అక్షరాలు, అంకెల రూపంలో యోగాసనాలు

ప్రసన్న యోగాలో ఉన్నత శిఖరాలు అందించడమే తన లక్ష్యం అంటుంది

Updated : 21 Jun 2021 16:22 IST


ఔరా అనిపిస్తున్న కర్నూలు యువతి

ప్రస్తుత యాంత్రిక జీవనంలో...ఆరోగ్యాన్ని  కాపాడుకోవడం  పెద్ద సవాలే. వ్యాయామం, మంచి ఆహారంతో రోగాలకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు...అదే సమయంలో యోగా ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. యోగా సాధనతో  కరోనా వంటి భయంకరమైన  వైరస్‌లను దరిచేరనీయకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు.  అలాంటి యోగాకు మరింత గుర్తింపును తెచ్చేందుకు కర్నూలు యువతి ప్రయత్నిస్తోంది. యోగాలో ఆమె చేస్తున్నవినూత్న సాధనపై ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

13నిమిషాల్లో వందకు పైగా ఆసనాలు
 రకరకాల ఆసనాలతో ఆకట్టుకుంటున్న ఈయువతి పేరు ప్రసన్న. కర్నూలుకు చెందిన ప్రసన్న ఆరో తరగతిలోనే యోగా పై ఆసక్తి పెంచుకుంది. ఓ గురువు వద్ద ఓనమాలు నేర్చుకుని క్రమం తప్పకుండా  సాధనతో యోగాపై పట్టుసాధించింది. ఏడాదిలో రాష్ర్ట స్థాయిపోటీల్లో పాల్గొని విశేషమైన ప్రతిభ కనబర్చి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. యోగాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ఆంగ్ల అక్షరాలు, అంకెలను యోగాసనాల ద్వారా వేస్తోంది. యోగా ప్రాధాన్యత తెలియజేయాలన్న ఉద్దేశంతో భరతనాట్యంతో అనుసంధానం చేసి 101 ఆసనాలు వేస్తుంది.కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే వందకు పైగా ఆసనాలు వేస్తూ..ఔరా అనిపిస్తుంది.

చిన్నారులకు యోగా నేర్పుతూ..

కర్నూలులో జరిగే యోగా డే కార్యక్రమంలో..ప్రసన్న యోగాసనాలు లేకుండా కార్యక్రమం జరగదంటే అతిశయోక్తి కాదు. జిల్లా, రాష్ర్ట జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటింది. ఈటీవీ ప్లస్‌ ఛానెల్‌లో నిర్వహించిన స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ కార్యక్రమంలో అద్భుత ప్రతిభ కనబర్చి.. మొదటి స్థానంలో నిలిచింది. చిన్నారులకు యోగా పాఠాలు నేర్పుతోంది. యోగా సాధనాల ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని.. కరోనా లాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చని ప్రసన్న చెబుతోంది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాన్నంటున్న ప్రసన్న యోగాలో ఉన్నత శిఖరాలు అందించడమే తన లక్ష్యం అంటుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని