Updated : 20 Aug 2020 17:06 IST

ఈ భవనం పొడవు ఒక కిలో మీటరు 

నిలువుగా వరుసపెట్టి ఓ ఐదారు గదులున్న భవనాన్ని చూస్తేనే... ఇదేంటిరా బాబు ఇది భవనమా.. రైలు బండా అని అడుగుతుంటారు. అలాంటిది కిలో మీటరు పొడవున్న భవనాన్ని చూపిస్తే! 

ఏంటీ అలాంటి భవనం కూడా ఉందా? అంటారా. అనడం ఏంటి... ఏకంగా ఆ ఇంటి గురించి వివరాలు, చరిత్ర చెబుదామని చూస్తుంటేను. అవును కిలోమీటరుకు పైగా పొడవున్న ఆ ఆసక్తికరమైన భవనం గురించి మీరూ చదివేయండి!

బుర్జ్‌ ఖలీఫా వంటి ఎత్తైన భవనాలను నేరుగా కాకపోయినా ఫొటోలోనో, వీడియోలోనో చూసుంటారు. కానీ అత్యంత పొడవైన భవనాన్ని ఎప్పుడైనా చూశారా? అలాంటి భవనం ఆస్ట్రియాలో ఉంది. రికార్డుల కోసమో, పర్యటక కేంద్రంగా మార్చడానికో నిర్మించిన భవనం కాదది.. ఇళ్లులేని పేదలకు ప్రభుత్వం కట్టించిన అతి పొడవైన ఇళ్ల సమూహం అది. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం కట్టిన ఆ భవనం చరిత్ర.. విశేషాలేంటో చూసేద్దాం పదండి..

ఆస్ట్రియా రాజధాని వియన్నా సమీపంలోని హైలిగిన్‌స్టాట్‌లో ఉన్న కార్ల్‌ మార్క్స్‌ హొఫ్‌ భవనం పొడవు 1,100 మీటర్లు ఉంటుంది. అంటే కిలోమీటర్‌పైనే. 1.56 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,382 ఇళ్లతో ఒకే భవనంగా నిర్మించారు. 1927లో నిర్మాణం ప్రారంభించగా.. 1930 నాటికి పూర్తయింది. భవనంలో ఇళ్లతోపాటు పార్కులు, క్లీనిక్స్‌, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలు, లాండ్రీలు, వ్యాయామశాలలు, పోస్టాఫీస్‌, ఫార్మసీ, 25 నిత్యావసర దుకాణాలను ఏర్పాటు చేశారు. ఐదు వేల జనాభా ఉండగలిగే ఈ భవనంలో తొలిసారిగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. అంతకుముందు వరకు ఆ ప్రాంతంలో అన్ని చోట్ల సామూహిక మరుగుదొడ్లే ఉండేవి. అప్పట్లో సంపన్నులకే బాల్కానీ ఉన్న ఇళ్లు ఉండేవి. ఈ భవనంలో అన్ని ఇళ్లకు బాల్కానీలు ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి కార్మికులు ఈ ఇళ్లను చూసి మురిసిపోయారు. 

ఇక దీని చరిత్ర విషయానికొస్తే.. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఆస్ట్రియా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయింది. అదే సమయంలో దేశంలోని రెండున్నర లక్షల మంది కార్మికులు సరైన సదుపాయాలు లేని ఇళ్లలో ఉండలేకపోతున్నామని ఆందోళన చేపట్టారు. అయితే 1919 ఎన్నికల తర్వాత దేశంలో సంస్కరణలు మొదలయ్యాయి. ముఖ్యంగా పేదవారికి, కార్మికులకు మంచి ఇళ్లు ఇవ్వడమే ధ్యేయంగా అన్ని చోట్ల అపార్ట్‌మెంట్లు, దుకాణాలు నిర్మించారు. ఈ క్రమంలోనే హైలిగిన్‌స్టాట్‌లో కార్ల్‌ మార్క్స్‌ హొఫ్‌ భవనాన్ని నిర్మించారు. అప్పటి నగర టౌన్‌ ప్లానర్‌ కార్ల్‌ ఎన్‌ ఈ భవనాన్ని డిజైన్‌ చేశారు.

ఇప్పటికీ నగరంలో పావు వంతు జనాభా ఈ భవనంలోనే నివసిస్తున్నారు. వారిలో ఎక్కువగా అప్పుడే ఉద్యోగాల్లో చేరి.. డబ్బు సంపాదనలో పడిన జంటలు ఉన్నాయి. కొద్దిగా డబ్బు సంపాదించగానే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఎందుకంటే ఆ ఇళ్లు చిన్నగా ఉంటాయి. వాషింగ్‌ మెషీన్‌, ఫ్రిజ్ వంటి వస్తువులు ఆ ఇంట్లో ఉంచే స్థలం ఉండదు. అయినా అందులోని ఒక్క ఇంటిని ప్రభుత్వం కేటాయించాలంటే నాలుగేళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు భవనం పాతబడుతుండటంతో కొన్ని చోట్ల గోడలు కూలిపోతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బాగు చేయించి ఇళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. ఈ భవనంలో కొన్ని హాలీవుడ్‌ సినిమాల చిత్రీకరణ కూడా జరిగింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని