Sputnik: హైదరాబాద్‌ చేరిన 30లక్షల డోసులు

దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులకు  జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో(జీహెచ్‌ఏసీ) వేదికైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి. మూడో విడతలో మరో 27.9లక్షల

Updated : 01 Jun 2021 12:50 IST

హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో(జీహెచ్‌ఏసీ) వేదికైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి. మూడో విడతలో మరో 27.9లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి.

రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ RU-9450 విమానం ఈ టీకాలు తీసుకుని మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటల ప్రాంతంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గోకు చేరుకుంది. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ టీకాలను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు తరలించారు. స్పుత్నిక్‌ టీకా సరఫరాలో అతిపెద్ద దిగుమతి ఇదే. అంతకుముందు తొలి విడతలో 1.5లక్షల టీకాలు, రెండో విడతలో 60వేల డోసులను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మొత్తం 30లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నట్లయింది. జూన్‌లో మరో 50లక్షల డోసులను పంపిస్తామని రష్యా ఇదివరకే వెల్లడించింది. జూన్‌ రెండోవారం నుంచి స్పుత్నిక్ వి టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు.

అతిపెద్ద వ్యాక్సిన్‌ దిగుమతి ఇదే.. 

ఇప్పటివరకు భారతదేశానికి వచ్చిన కొవిడ్ వ్యాక్సిన్లలో అతిపెద్ద దిగుమతి ఇదే. భారతదేశంతో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీహెచ్‌ఏసీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందని ఎయిర్‌కార్గో తెలిపింది.
రాబోయే రోజుల్లో హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల వివిధ రకాల కొవిడ్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకుంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల దిగుమతిని సజావుగా నిర్వహించేందుకు అన్ని వనరులను సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. ఎయిర్‌కార్గోలో టెంపరేచర్ కంట్రోల్డ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని, టెర్మినల్ నుంచి విమానానికి సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి టెంపరేచర్ కంట్రోల్డ్  ‘కూల్ డాలీ’ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. దీని వల్ల ట్రక్కు ఆఫ్‌లోడింగ్ పాయింట్ నుంచి విమానం లోడింగ్ వరకు వ్యాక్సిన్లు, ఔషధాల ఎలాంటి ఆటంకాలూ లేని కోల్డ్ చెయిన్ సదుపాయాలను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని