Chandrababu Arrest: ఈ ఫిర్యాదే ఒక అభూత కల్పన: హైకోర్టులో హరీశ్ సాల్వే వాదనలు
తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం మొదలైన వాదనలు భోజన విరామం అనంతరం తిరిగి కొనసాగుతున్నాయి.
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(AP High court)లో వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం మొదలైన వాదనలు భోజన విరామం అనంతరం తిరిగి కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే(Harish Salve) వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కేసులో పలు కీలక అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఈ ఫిర్యాదే ఓ అభూత కల్పనని అన్నారు. హైకోర్టు ముందు ఆయన వినిపించిన వాదనల్లో కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే.. ‘‘ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఎ కింద తగిన అనుమతులు తీసుకోలేదు. ఈ ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధమైనది. గతంలో వచ్చిన జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారు. సెక్షన్ 17ఎ పూర్తివివరాలు తెలిసి కూడా తప్పనిసరి అనుమతులను తీసుకోలేదు’’ అని వాదించిన హరీశ్ సాల్వే ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ -తేజ్‌మల్ చౌదరి కేసును ఉదహరించారు.
సెక్షన్ 17ఎ వర్తిస్తుంది..
‘‘నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు.. దర్యాప్తు వేళ ఉన్న చట్టబద్ధత పరిగణించాలి. కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకొని సెక్షన్ 17ఎ వర్తిస్తుంది. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ అనేది కచ్చితంగా వర్తిస్తుంది. 2018 చట్టసవరణ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు 17ఎ వర్తిస్తుంది. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు కనుకే ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇప్పుడు పదవిలో లేరు కనుక ఆ నిబంధన వర్తించదనడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు. కొత్త ప్రభుత్వం.. పాత ప్రభుత్వం మీద ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఈ నిబంధన పెట్టారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ కౌంటర్ మాకు ఇచ్చారు. కౌంటర్‌లో కూడా గతంలో పొందుపరిచిన ఆరోపణలనే మళ్లీ చెప్పారు’’
ఇది కచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసుగా పరిగణించాలి..
‘‘ఇది కచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసుగానే పరిగణించాలి. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న సమయంలో కేసును ఏకపక్షంగా చూడకూడదు. హైకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా విచక్షణాధికారాన్ని వినియోగించాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీన్ని ప్రతీకారపూర్వక కేసుగానే పరిగణించాలి. ఇదే కేసుకు సంబంధించిన జీఎస్టీ ఫిర్యాదులను హైకోర్టు పరిశీలించింది. ప్రాజెక్టులో 90శాతం ప్రైవేటు సంస్థ.. 10శాతం ప్రభుత్వం భరిస్తుంది. యువతలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ కేసుకు ప్రాతిపదికైన ప్రాజెక్టు రిపోర్టులు, వాటి విలువ మదింపు చేశారు. వాటి వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి’’ అని స్కిల్ డెవలప్‌మెంట్ మదింపు నివేదికను హరీశ్ సాల్వే కోర్టుకు చదివి వినిపించారు’’.
శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కాలేదని ఫిర్యాదులో చెప్పలేకపోయారు..
‘‘ నగదు అంశమే ప్రభుత్వానికి సంబంధించింది.. మిగతావన్నీ ప్రైవేటు సేవలే. స్కిల్ సెంటర్లకు భూమి, అనుమతితో పాటు రూ.330 కోట్లు చెల్లించాలని ఒప్పందం. ₹330 కోట్లు అనేది ప్రాజెక్టు విలువలో దాదాపు 10శాతానికి సమానం. ప్రాజెక్టులో రాష్ట్ర భాగస్వామ్యం స్వల్పం.. ప్రైవేటు సంస్థలదే అధిక బాధ్యత. ఒప్పందం తర్వాత ఎవరు ఏం చేయాలనేది అంగీకార పత్రం తీసుకున్నారు. ప్రాజెక్టు ప్రతిపాదించారు.. పూర్తయింది.. ప్రభుత్వానికి అందించారు. ప్రభుత్వానికి అప్పగించిన ఒప్పందాలు, సంతకాలు పూర్తయ్యాయి. పరిణామాలు పరిశీలిస్తే ఇది ప్రస్తుత ప్రభుత్వ అధికార దుర్వినియోగమే. అనుబంధ సంస్థే కేంద్రాలు ఏర్పాటు చేసిందని సిమెన్స్ స్పష్టం చేసింది. కేంద్రాలు ఏర్పాటు పూర్తయ్యింది.. ప్రభుత్వానికి అందించారు. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. ఫిర్యాదును పరిశీలిస్తే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కాలేదని చెప్పలేకపోయారు. సెన్‌వ్యాట్ అంశాల ఆధారంగా శిక్షణ కేంద్రాల ఛైర్మన్ ఫిర్యాదు చేశారు.’’
ఈ ఫిర్యాదే ఒక అభూత కల్పన..
‘‘ఇది కేవలం పన్ను చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు.. నడుస్తున్నాయి. ఒకవేళ ఇన్‌వాయిస్‌లు పెంచి చూపించారన్నా అది అంతర్గత అంశమే. ఒకవేళ ఇలాంటి పరిస్థితులున్నా అప్పటి సీఎం ఎలా బాధ్యులవుతారు? ఇది కేవలం సెన్‌వ్యాట్ సమస్యే. పన్ను కేసును తీసుకొచ్చి అవినీతి నిరోధక చట్టం కింద కేసు ఎలా పెడతారు? ఈ కేసులో సెక్షన్ 17ఏ అనేది కచ్చితంగా వర్తిస్తుంది. కేసు నమోదు చేసిన వారు ముందస్తు అనుమతి తీసుకోలేదు. కేవలం మెమో ఆధారంగానే మాజీ సీఎంను నిందితుడిగా చేర్చారు. ఈ ఫిర్యాదే ఒక అభూత కల్పన. ఒప్పందంలోని అన్ని కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులూ ఏర్పాటు చేశారు. ఎక్కడా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందన్న ఆధారం లేదు. ఇది సంపూర్ణంగా అసంబద్ధమైన ఆరోపణ. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులను ‘హెంచ్‌మన్’ అని ఎలా సంబోధిస్తారు? ‘అపాయింటెడ్ హంచ్‌మెన్’ అని అధికారులు ఫిర్యాదులో సంబోధించవచ్చా? ప్రాజెక్టుకు కట్టిన విలువ సరసమైనదని కేంద్ర సంస్థలు చెబుతున్నాయి. ఫిర్యాదులో ప్రైవేటు సంస్థలు లాభాలు దండుకున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థను ఈ కేసులో భాగస్వామి చేయాలి కదా? ఈ ప్రాజెక్టులో 10శాతం ప్రభుత్వంఇవ్వాలి. మిగిలింది ప్రైవేటు సంస్థలు పెట్టుకోవాలి. కాల క్రమంలో ప్రాజెక్టు పూర్తయింది.. అసలు ఈ కేసు ఎందుకు పెట్టినట్టు?’’ అని సాల్వే వాదనలు వినిపించారు.
చంద్రబాబుకు 17ఎ వర్తించదు.. సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి
మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు సంబంధించి సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అయితే, మాజీ సీఎం చంద్రబాబుకు 17ఎ వర్తించదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. అది పబ్లిక్ సర్వెంట్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. అరుదైన కేసుల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాలని.. ఇలాంటి వాటిల్లో కాదని వాదించారు. ‘‘చంద్రబాబును సెప్టెంబర్ 7న నిందితుడిగా పేర్కొన్నారు. అదే నెల 9న అరెస్టు చేశారు. 12న క్వాష్ పిటిషన్ వేశారు.. ఈరోజు 19వ తేదీ. చంద్రబాబును అరెస్టు చేసి 10 రోజులే అయింది. కేసు దర్యాప్తు ఇప్పుడే మొదలైంది. ఈ కేసును ఇప్పుడే తీసుకోవద్దని కోర్టుకు మనవి చేస్తున్నాం. పిటిషనర్ తరఫున 900 పేజీల డాక్యుమెంట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును విచారణకు తీసుకోవద్దు. ఇంత లోతైన కేసు దర్యాప్తు 10 రోజుల్లో సాధ్యం కాదు. ఇప్పటికే పిటిషనర్ బెయిల్ కూడా దరఖాస్తు చేశారు. నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. నిధుల దుర్వినియోగం కేసులో 17ఎ వర్తించదు. పథకం ప్రకారం రూ.370 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ నిధులు దోచుకోవడాన్ని ప్రజాసేవ అనలేం. ఐఏఎస్ అధికారి సంతకం చేసినందున స్కామ్ అనకుండా ఉండలేం. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో పన్నుల శాఖ, పీఎంఎల్‌ఏ దర్యాప్తు జరుగుతోంది’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్‌లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..
-
Mansion 24 Trailer: ఆ భవంతిలోకి వెళ్లిన వారందరూ ఏమయ్యారు: ‘మాన్షన్ 24’ ట్రైలర్