గెలుపు.. ఓటమి.. రెండింటి నుంచీ పాఠాలు నేర్చుకోండి

గెలుపు, ఓటమి.. రెండింటి నుంచీ పాఠాలు నేర్చుకోవాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. తన అధికారిక నివాసంలో పార్టీ కార్యదర్శులతో ఆయన సోమవారం

Published : 07 Jun 2021 23:10 IST

5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు మోదీ దిశా నిర్దేశం

దిల్లీ: గెలుపు, ఓటమి.. రెండింటి నుంచీ పాఠాలు నేర్చుకోవాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. తన అధికారిక నివాసంలో పార్టీ కార్యదర్శులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ సమావేశంలో వారికి దిశానిర్దేశం చేశారు. అసోం, పుదుచ్చేరీల్లో విజయం సాధించినందుకు కార్యకర్తలను మోదీ అభినందించారు. 

రాబోయే కాలంలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ కీలకం కానుంది.  అయితే ప్రతిష్టాత్మకంగా భావించిన బెంగాల్‌ను చేజార్చుకున్పప్పటికీ అక్కడ కాషాయ పార్టీ తన బలాన్ని 3 నుంచి 77 సీట్లకు పెంచుకుంది. తమిళనాడులోనూ భాజపాకు చుక్కెదురైంది. చాలా శ్రమించినప్పటికీ అక్కడ అన్నాడీఎంకే కూటమితో కలిసి విజయం సాధించలేకపోవడం.. తదుపరి ఎన్నికలపై భాజపా ఎక్కువ దృష్టి సారించేలా చేసింది.  

కొవిడ్‌ తీవ్రత, సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యతిరేకతతో పాటు పార్టీలో పుట్టుకొచ్చిన అసమ్మతి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారం తిరిగి సంపాదించడం భాజపాకు కత్తి మీద సాములా తయారైంది. అయితే నాయకత్వ మార్పును భాజపా తోసిపుచ్చినప్పటికీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని సీఎంకు సలహా ఇచ్చింది. మరోవైపు ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌పైనా పార్టీ దృష్టి కేంద్రీకరించింది. కానీ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ తన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని చికాకు పెడుతుండటంతో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని