Offbeat: ‘క్షమించాలి.. 51 ఏళ్ల ఆలస్యమైంది’.. దశాబ్దాల తర్వాత లైబ్రరీకి ఆ బుక్‌

తాను తీసుకున్న ఓ బుక్‌ను 51 ఏళ్ల తర్వాత ఆ లైబ్రరీకి అప్పగించాడు ఓ ఔత్సాహికుడు. ఐదు దశాబ్దాలపాటు తన వద్దే ఉంచుకున్నా.........

Published : 18 Jun 2022 02:19 IST

ఇంటర్నెట్‌ డస్క్‌: లైబ్రరీ నుంచి ఏదైనా పుస్తకాన్ని తీసుకోవాలంటే పలు నిబంధనలు పాటించి తీరాల్సిందే. పుస్తకానికి ఎలాంటి డ్యామేజీ జరగకూడదు. 10-20 రోజుల్లోగా ఆ పుస్తకాన్ని తిరిగి సమర్పించాలి. కానీ ఓ ఔత్సాహికుడు తాను తీసుకున్న పుస్తకాన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా తిరిగి ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు 51 ఏళ్ల తర్వాత ఆ బుక్‌ను తాను తీసుకున్న పబ్లిక్‌ లైబ్రరీలో అప్పగించాడు. ఐదు దశాబ్దాలపాటు తన వద్దే ఉంచుకున్నా.. ఆ పుస్తకానికి ఎలాంటి డ్యామేజీ జరగనివ్వకపోవడం విశేషం.

ఈ అరుదైన ఘటన కెనడాలోని వాంకోవర్‌ నగరంలో జరిగింది. ఓ ఔత్సాహికుడు 1971 ఏప్రిల్‌ 20న తీసుకున్న ‘ది టెలిస్కోప్‌’ (The Telescope) అనే పుస్తకాన్ని ఈ మధ్యే తిరిగి ఆ లైబ్రరీకి అందించాడు. ఆ పుస్తకంలో ఓ గమ్మత్తయిన లేఖను కూడా ఉంచాడు. ‘మీ లైబ్రరీ నుంచే తీసుకున్నా. క్షమించాలి, కాస్త ఆలస్యమైంది. 51 ఏళ్లు. కానీ ఎలాంటి డ్యామేజీ జరగలేదు. ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు.

కాగా పుస్తకంతోపాటు ఆ ఔత్సాహికుడు రాసిన లేఖను వాంకోవర్ పబ్లిక్‌ లైబ్రరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. ఇన్నాళ్లు గడిచినా మర్చిపోకుండా ఆ బుక్‌ను లైబ్రరీకి అందించడం  ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ ఆలస్యానికి ఎలాంటి జరిమానా విధించడంలేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని