ఇవి పాటిస్తే.. 9 క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చు!

క్యాన్సర్లలో జన్యువుల కన్నా మన ఆహార విహారాల పాత్రే ఎక్కువ. పది క్యాన్సర్లలో జన్యుపరంగా తలెత్తేది ఒకటే. మిగతా 9 క్యాన్సర్లకు

Published : 28 Jan 2021 13:17 IST

క్యాన్సర్లలో జన్యువుల కన్నా మన ఆహార విహారాల పాత్రే ఎక్కువ. పది క్యాన్సర్లలో జన్యుపరంగా తలెత్తేది ఒకటే. మిగతా 9 క్యాన్సర్లకు జీవనశైలే ప్రధాన కారణం. అందుకే అధ్యయనాలు జీవనశైలి మార్పులకే అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్యాన్సర్ల నివారణకు ఆహార, విహారాలు ఎలా తోడ్పడతాయో తాజా పరిశోధనలు మరోసారి వివరిస్తున్నాయి.

వ్యాయామ రక్ష

క్రమం తప్పకుండా వ్యాయామం చేసే రొమ్ముక్యాన్సర్‌ బాధితులకు క్యాన్సర్‌ తిరగబెట్టటం, మరణించే ముప్పు తగ్గుతున్నట్టు ఇటలీ పరిశోధన పేర్కొంటోంది. వ్యాయామం మూలంగా ఒంట్లో క్యాన్సర్‌తో పోరాడే అణువుల పనితీరు పుంజుకుంటున్నట్టు, క్యాన్సర్‌ కారక అణువులు నిర్వీర్యమవుతున్నట్టు తేలింది. క్యాన్సర్ల నివారణకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడగలదని ఇది చెప్పకనే చెబుతోంది. క్యాన్సర్‌ను ఎదుర్కొనే అణువుల పనితీరును పెంపొందించే మందుల తయారీకి కూడా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు.

ఆహార బలం

పెద్దపేగు క్యాన్సర్‌ వంటి కొన్నిరకాల క్యాన్సర్లకూ ఆహారానికీ సంబంధం ఉండటం ఇప్పటికే తెలుసు. కెనడా పరిశోధకులు వీటి జాబితాలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నూ చేర్చారు. పండ్లు, కూరగాయలు, వృక్ష సంబంధ ప్రొటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తినేవారితో పోలిస్తే.. ఉప్పు, మాంసం, మద్యం, గంజి ఎక్కువగా ఉండే పిండి పదార్థాలు, తీపి పానీయాలు అధికంగా తీసుకునేవారికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. వయసు, జాతి, కుటుంబ చరిత్ర, తరచూ ముందస్తు పరీక్షల వంటి వాటితో నిమిత్తం లేకుండానే ఈ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటున్నట్టు తేలడం గమనార్హం. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తినేవారికి ఇతరత్రా మంచి అలవాట్లు సైతం ఉండొచ్చనే విషయాన్నీ మరవరాదని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.

దంత శుభ్రత అండ

రోజూ సన్నటి తాడుతో దంతాల సందులను శుభ్రం చేసుకోవటం (ఫ్లాసింగ్‌) నోటి శుభ్రతకే కాదు.. జీర్ణాశయ, అన్నవాహిక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 22 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. పురుషుల్లో చిగుళ్లవాపు గల ప్రతి 65 మందిలో ఒకరు జీర్ణాశయ క్యాన్సర్‌.. ప్రతి 87 మందిలో ఒకరు అన్నవాహిక క్యాన్సర్‌ బారినపడ్డట్టు పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణం నోటిలోని బ్యాక్టీరియా కావొచ్చని భావిస్తున్నారు. స్త్రీలకు ఇలాంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువే గానీ చిగుళ్లవాపుతో దంతాలు ఊడిపోవటం వంటి సమస్యలు పొంచి ఉంటాయని తెలుసుకోవాలి. ఫ్లాసింగ్‌తో దంతాల మధ్య బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీంతో చిగుళ్లవాపు, దంతాలు ఊడటం వంటి సమస్యలు దరిజేరవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని