Health: జీవనశైలి మారితే అనారోగ్యమే సుమా..!

 ఆధునిక జీవన శైలి ఎంత సౌకర్యంగా ఉంటుందో..అంతే అనారోగ్యం తెచ్చి పెడుతోంది. దారితెన్నూ లేని ఆహారపు అలవాట్లు, కూర్చున్నచోటు నుంచి కాలు కదపకుండా పనులు చేయడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, చాలీచాలని నిద్ర కలగలసి ఒంటిని సమస్యల కుప్పగా మార్చుతున్నాయి.

Updated : 10 Aug 2022 11:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆధునిక జీవన శైలి ఎంత సౌకర్యంగా ఉంటుందో..అంతే అనారోగ్యం తెచ్చి పెడుతోంది. దారితెన్నూ లేని ఆహారపు అలవాట్లు, కూర్చున్నచోటు నుంచి కాలు కదపకుండా పనులు చేయడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, చాలీచాలని నిద్ర కలగలసి ఒంటిని సమస్యల కుప్పగా మార్చుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, కొలస్ట్రాల్‌,క్యాన్సర్లు, పక్షవాతం, అధిక బరువు గాడితప్పిన జీవనశైలితో తెచ్చుకుంటున్నాం. జీవనశైలి జబ్బులు-ప్రాథమిక సూత్రాలను  సీనియర్‌ డయాబెటాలజిస్టు పి.వి.రావు, సీనియర్‌ జనరల్‌ ఫిజిషియన్‌ పి.వి రావు, సీనియర్‌ కార్డియాలజిస్టు రమేష్‌గూడపాటి, పోషకాహార నిపుణురాలు అంజలీదేవి, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ స్పెషలిస్టు భక్తియార్‌చౌదరి, క్లినికల్‌ సైకాలజిస్టు కళ్యాణ్‌ చక్రవర్తి వివరించారు.

* జీవన శైలి మారడంతో నాన్‌ కమ్యూనబుల్‌ డీసీజెస్‌ వస్తాయి. దీనికి కాలుష్యం కూడా ఒక కారణం. దాదాపుగా 30 శాతం గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం,పక్షవాతం, అధిక బరువు లాంటి సమస్యలు వస్తాయి. 

* వృత్తి పరంగా నాలుగైదు గంటలు కుర్చీలో కూర్చొవాల్సి వస్తే అరగంటకోసారి ఐదునిమిషాలు లేచి అటుఇటూ తిరగాలి.

అధిక రక్తపోటు: పైకి కనిపించని ఉపద్రవం ఇది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది బాధితులున్నారు. 2025 నాటికి మూడోవంతు జనాభాకు అధిక రక్తపోటు రానుందని పరిశోధనలు చెబుతున్నాయి. కిడ్నీ జబ్బులు, పక్షవాతం రావడానికి అధిక రక్తపోటు కారణం. ఇది షుగర్‌లాగే సైలెంట్‌ కిల్లరే. ఆయాసం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించగానే బీపీ ఉందని తెలుసుకోవాలి. విద్యార్థుల నుంచి మొదలు పెద్దవారికి కూడా బీపీ రావడానికి మానసిక ఒత్తిడి కారణం. వ్యాయామం చేయకుండా అధిక కొవ్వు ఉండే పదార్థాలు తినడంతో సమస్యగా మారుతోంది. కనీసం ఏడాదికోసారైనా బీపీ పరీక్ష చేయించుకోవాలి.

గుండె జబ్బులు: మారుతున్న జీవన శైతితో చాలా మంది గుండెకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. తిండితీరు., ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. పొగ, మద్యం లాంటి వ్యసనాలు మానేయాలి. వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. పండ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నియంత్రించుకుంటే మంచిది. 

అదుపు తప్పుతున్న ఆహారం: మనం తినే ఆహారం ఆరోగ్యాన్నిఇచ్చేదిగా ఉండాలి. కానీ సమయం లేదని పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తెప్పించుకొని వేళాపాళా లేకుండా తింటున్నాం. ఎండాకాలం వచ్చిందంటే బయట దొరికే చల్లని పానీయాలు తీసుకుంటారు. దీనితో సమస్యలు తప్పా ఏమీ ప్రయోజనం ఉండదు. తిన్నంత ఆహారానికి శ్రమించకపోవడంతో జబ్బులు వస్తున్నాయి. మనం తినే ఆహారంలో సగం ఆకు, కాయగూరలు,పండ్లు ఉండాలి. మిగిలిన సగంలో మాంసకృతులు, కొవ్వునిచ్చే పదార్థాలు, ఇతరత్రా ఉండాలి. 

సర్వరోగ నివారిణి: మానవులకు వచ్చే సర్వ రోగాలకు నివారిణి వ్యాయామం. చాలా మంది వ్యాయామం చేయడానికి బద్దకిస్తారు. శరీరానికి శ్రమ కరవై అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక మనిషి వ్యాయామం చేయకపోతే ప్రతి పదేళ్లకు మూడేళ్ల ఆయువు తగ్గుతుంది. శ్రమిస్తే జీవితకాలం పెరుగుతుంది. మన దగ్గర చాలామంది జబ్బులు వస్తేనే వ్యాయామం చేస్తారు..లేకపోతే చేయరు. 30-50 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లు కనీసం 7 గంటలు నిద్రపోవాలి.

మానసిక వికాసం: వ్యక్తిగత అవగాహన వచ్చినట్లయితే ఆరోగ్యం బాగు పడేందుకు అవకాశాలున్నాయి. రోజంతా ఫోన్‌ చూసినట్టుగానే ఒక డైరీని  నిర్వహించాలి. ప్రతి రోజు వ్యక్తిగతంగా వచ్చిన మార్పును రాసుకోవాలి. యాక్షన్‌ప్లాన్‌ కూడా తెలుసుకోవాలి. ఇలా చేస్తే తనకు ఎదురయిన ప్రతి అంశాన్ని సమర్ధంగా ఎదుర్కొవడానికి వీలుంటుంది. దీంతోనే మానసిక వికాసం ఏర్పడుతుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts