Liquor Price: తెలంగాణలో లిక్కర్‌పై 20 నుంచి 25శాతం పెంపు

తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను దాదాపు 20 నుంచి 25 శాతం

Updated : 19 May 2022 16:03 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను దాదాపు 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో బీరుపై రూ.10, క్వార్టర్‌ లిక్కర్‌ సీసాపై రూ.20, వెయ్యి ఎంఎల్‌ల లిక్కర్‌పై రూ.120 వరకు ధర పెరిగింది. పెంచిన మద్యం ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే, ఆయా బ్రాండ్‌లను బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండనుంది.

2021-23 మద్యం విధానం అమల్లోకి వచ్చాక ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఈ అంశంపై బుధవారం రాత్రి వరకు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఏ రకం మద్యంపై ఎంత ధర పెంచాలనే విషయంలో రాత్రి స్పష్టత రాకపోగా.. ఈ ఉదయం నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి మద్యం విక్రయ వేళలు ముగియగానే వైన్స్‌, బార్లు, పబ్‌లను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ మేరకు ఆయా నిర్వాహకులకు ముందస్తుగానే సమాచారం అందించిన విషయం తెలిసిందే.

పాత ఎమ్మార్పీలు ఉన్నా కొత్త ధరలు వర్తిస్తాయ్‌

మరోవైపు పెరిగిన మద్యం ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌తోపాటు విదేశీ మద్యం ధరలు కూడా పెంచినట్లు ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారికంగా తెలిపారు. రెండేళ్ల కిందట 2020 మే నెలలో మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. తిరిగి ఇవాళ పెంచినట్లు వివరించారు. అదేవిధంగా మద్యం బాటిళ్లపై పాత ఎమ్మార్పీలు ఉన్నప్పటికీ.. వాటికి కూడా పెరిగిన కొత్త ధరలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. 

రెండు వందల లోపు ఎంఆర్పీ ఉన్న బ్రాండ్లపై 180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40, 750 ఎంఎల్‌పై రూ.80 లెక్కన పెంచినట్లు వివరించారు. అదే విధంగా రెండు వందల కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న బ్రాండ్లపై 180 ఎంఎల్‌పై రూ.40, 375 ఎంఎల్‌పై రూ.80, 750 ఎంఎల్‌పై రూ.160 చొప్పున పెంచినట్లు సర్పరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. వైన్‌ బ్రాండ్‌ ఎంఆర్పీపై క్వార్టర్‌, హాఫ్‌, ఫుల్‌ బాటిళ్లపై రూ.10, రూ.20, రూ.40 లెక్కన పెంచారు. అన్ని రకాల బీరు బ్రాండ్ల బాటిల్‌ ఎంఆర్పీపై రూ.10లు పెంచినట్లు వివరించారు. ఎంఆర్పీ ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే 1800 425 2523 నంబర్‌కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

బీర్లు- ఏ బ్రాండ్‌పై ఎంత పెరిగిందంటే..

లిక్కర్‌- వివిధ బ్రాండ్లపై పెంపు ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని