Health: కాలేయ మార్పిడి ఎప్పుడు అవసరమంటే...

కాలేయం బాగుంటేనే మనకు ఆరోగ్యం. దానికేమైనా సమస్య వస్తే అనారోగ్యం దరి చేరుతుంది. సమస్యలతో శరీరం అతులాకుతలం అవుతుంది. కాలేయం 90శాతం పాడయినా మందులతో నయం చేసే అవకాశం ఉంది.

Published : 29 Apr 2022 00:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలేయం బాగుంటేనే మనకు ఆరోగ్యం. దానికేమైనా సమస్య వస్తే అనారోగ్యం దరి చేరుతుంది. సమస్యలతో శరీరం అతులాకుతలం అవుతుంది. కాలేయం 90శాతం పాడయినా మందులతో నయం చేసే అవకాశం ఉంది. పూర్తిగా దెబ్బతిని పాడైన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్నిమార్పిడి చేయాల్సి ఉంటుంది. అది ఏ సందర్భంలో చేయాల్సి ఉంటుందో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌ ఆర్‌.వి.రాఘవేంద్రరావు వివరించారు.

కాలేయ ప్రాధాన్యమిది: ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం, పేంక్రియాస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం జీర్ణం చేసిన తర్వాత హార్మోన్‌, ఎంజైమ్‌, ప్రోటీన్‌, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందించే పరిశ్రమలా కాలేయం పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన గ్లూకోజ్‌ నిల్వలను ఉంచుకుంటుంది. రక్తంలో గ్లూకోజ్‌ మితిమీరకుండా చూస్తుంది.

కాలేయం దెబ్బతిన్నట్టు ఎలా తెలుస్తుందంటే..? కామెర్లు రావడం, రక్త వాంతులు, మల విసర్జన నల్లగా ఉండటం, బరువు తగ్గడం, జాండీస్‌తో పాటు దురద, జ్వరం ఉండటం, కాళ్లు, కడుపులో నీరు చేరితే కాలేయం సమస్య ఉందని గుర్తించాలి. 

లివర్‌ మార్పిడి ఎవరికి అవసరం?: దీర్ఘకాలంగా మద్యం తీసుకోవడం, హైపటైటీస్‌ బీ. సీ వైరస్‌ కారణాలతో కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. అది చేయాల్సిన పనులను ఏదీ చేయదు. దాన్ని సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌గా పిలుస్తాం. ఈ సమయంలో లివర్‌ తనంతట తాను గానీ, మందులతో గానీ లివర్‌ పని చేసే అవకాశం ఉండదు. అప్పడే లివర్‌ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది.

దాతల నుంచి సేకరణ ఎలా: ఎవరైనా బ్రెయిన్‌ డెడ్‌ అయినపుడు అవయవదానం చేస్తామని ప్రకటించినా, కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేస్తామని ముందుకు వచ్చిన తర్వాత కాలేయం సేకరించడానికి వీలుంటుంది. కుటుంబంలోని రక్త సంబంధం ఉన్నవారి నుంచి కూడా కొంత కాలేయం తీసుకోవచ్చు. 

ఆపరేషన్‌ ఎలా: ముందుగా పాడైన కాలేయాన్ని తీసివేయాలి. వైద్యుల బృందంతో కాలేయం సేకరించి నిర్ణీత కాల వ్యవధిలో 10-12 గంటల లోపు అమర్చాలి. 

కాలేయ సమస్యలు రాకుండా జీవన శైలి ఎలా ఉండాలంటే..? ఆల్కాహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. క్రమ పద్ధతిన ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. గాలి, దుమ్ము, కలుషిత నీటితో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని