మిడతల దండు మళ్లీ వస్తోంది..

గతేడాది ఉత్తరాది రైతులను వణికించిన మిడతల దండు మళ్లీ వస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కీటకాల సమూహం కనిపించినట్టు ఆక్కడి వ్యవసాయ అధికారులు వెల్లడించారు.

Updated : 13 May 2022 16:19 IST

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కనిపించిన కీటకాల సమూహం

    రైతులను అప్రమత్తం చేస్తున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ వ్యవసాయ అధికారులు 


ఆగ్రా: గతేడాది ఉత్తరాది రైతులను వణికించిన మిడతల దండు మళ్లీ వస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కీటకాల సమూహం కనిపించినట్టు ఆక్కడి వ్యవసాయ అధికారులు వెల్లడించారు. దీంతో ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి సమీపంలోని ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యవసాయ శాఖ నడుం బిగించింది. ఈ నెల చివరి నాటికి కీటకాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మిడతల దండు ఒక్కసారి పంటలపై వాలితే గంటల వ్యవధిలోనే ఎకరాల కొద్దీ ధాన్యాన్ని తినేయగలదు. ఆహారం కోసం లక్షలాది మిడతలు ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్‌ నుంచి రాజస్థాన్‌కు వలస వచ్చినట్టు ఆగ్రా జిల్లా వ్యవసాయ అధికారి రామ్‌ ప్రవేశ్‌ తెలిపారు. ప్రస్తుతం జైసల్మేర్‌లో ఉన్న ఈ మిడతల దండు త్వరలో ఆగ్రాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు ఆయన వివరించారు. రానున్న ముప్పు గురించి ఇప్పటికే రైతులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పొలాల్లో పంటలు లేకపోగా.. 30 వేల ఎకరాల్లో మాత్రం కూరగాయలు సాగవుతున్నట్టు చెప్పారు. కీటకాలను ఎదుర్కొనేందుకు తగిన రసాయనాలను పిచికారీ చేయాలని సూచించారు. ఈ కీటకాలు రోజుకు 150 కిలోమీటర్లు ప్రయాణించగలవని ఆయన వెల్లడించారు. ఇవి ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణిస్తాయని తెలిపారు. వాటిని నాశనం చేసేందుకు రసాయనాలను పిచికారీ చేసే యంత్రాలు బిగించిన ట్రాక్టర్లను సిద్ధం చేసినట్టు వివరించారు. పాత్రలు, రేకు డబ్బాలు, డప్పులు మోగించడం ద్వారా మిడతలను తరిమేయాలని రైతులకు సూచించారు. పొగ పెట్టడం ద్వారా కూడా కీటకాల నుంచి అన్నదాతలు తమ పంటలను కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.     

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని