Long Covid: ఎనిమిదిలో ఒకరికి లాంగ్‌ కొవిడ్‌ సమస్యలు.. : ది లాన్సెట్‌

కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో కనీసం ఒకరు లాంగ్‌ కొవిడ్‌ (Long Covid) లక్షణాలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 05 Aug 2022 15:48 IST

నెదర్లాండ్‌ పరిశోధకుల తాజా అధ్యయనం

ప్యారిస్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ (Coronavirus) మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ బాధితులపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో కనీసం ఒకరు లాంగ్‌ కొవిడ్‌ (Long Covid) లక్షణాలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. నెదర్లాండ్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ (The Lancet)లో ప్రచురితమైంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50కోట్ల మంది కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, వీరిలో కొందరికి కొవిడ్‌ లక్షణాలు (Symptoms) దీర్ఘకాలం పాటు వేధిస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో లాంగ్‌కొవిడ్ లక్షణాలు ఏమేరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు నెదర్లాండ్‌ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా నెదర్లాండ్‌లోని 76,400 మందిని సర్వే చేసి దాదాపు 23 రకాల లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలతో కూడిన ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు.

ఎనిమిదిలో ఒకరికి..

ఈ సర్వేను మార్చి 2020 నుంచి ఆగస్టు 2021 వరకు చేపట్టగా అందులో దాదాపు 24సార్లు వారినుంచి సమాధానాలు తీసుకున్నారు. ఈ క్రమంలో లాంగ్‌కొవిడ్‌ లక్షణాలను కచ్చితంగా అంచనా వేసేందుకు గాను.. సర్వేలో పాల్గొన్న వారు కొవిడ్‌కు ముందు, కొవిడ్‌ తర్వాత ఏ విధమైన లక్షణాలు ఎదుర్కొన్నారనే విషయాన్ని పరిశోధకులు రికార్డు చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 5.5శాతం మంది (4200) కొవిడ్‌ బారినపడగా.. అనంతరం ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత వారిలో 21శాతం మందిని కనీసం ఒక లక్షణం మూడు నుంచి ఐదు నెలలపాటు వేధించినట్లు వెల్లడించారు. కొవిడ్‌ సోకని వారిలో సుమారు తొమ్మిది శాతం మంది ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.

ఇలా మొత్తంగా సమాచారాన్ని విశ్లేషిస్తే.. కొవిడ్‌ సోకిన వారిలో ఎనిమిది మందిలో ఒకరు లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపడినట్లు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పి, రుచి, వాసన కోల్పోవడం, సాధారణంగా వికారం వంటి లక్షణాలు దీర్ఘకాలం వేధిస్తున్నట్లు గుర్తించారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారు లేదా ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారినపడిన వాళ్లలో లాంగ్‌ కొవిడ్‌ లక్షణాల రేటు తక్కువగానే ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని పరిశోధకులు గుర్తుచేశారు.

మరింత అధ్యయనం అవసరం..

మరోవైపు డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్ల ప్రభావం ఉన్నప్పుడు ఈ అధ్యయనం జరపనందున.. వాటివల్ల కలుగుతోన్న బ్రెయిన్‌ ఫాగ్‌ (Brain Fog) వంటి లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డచ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గ్రోనింగెన్‌ అభిప్రాయపడ్డారు. వీటితోపాటు మానసిక ఆరోగ్యంపై లాంగ్‌కొవిడ్‌ ప్రభావాన్ని అంచనా వేయాలన్న మరో నిపుణుడు జుదిత్‌ రాస్‌మలెన్‌.. కుంగుబాటు, ఆందోళన వంటి లక్షణాలపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. ఇక ఇప్పటివరకు లాంగ్‌కొవిడ్‌పై జరిపిన అధ్యయనాల్లో ఇదే ప్రధాన పురోగతి అని.. ఎందుకంటే వైరస్‌ సోకనివారిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ అధ్యయనం చేయడం మంచి విషయమని మరో నిపుణుడు క్రిస్టోఫర్ బ్రైట్‌లింగ్‌ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని