
కాలుష్యంతో కొవిడ్ మరణాలు పెరిగే ఛాన్స్!
బోస్టన్: దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురయ్యేవారిలో కొవిడ్-19తో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. 2.5 మైక్రాన్లు అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే ధూళికణాలతో ఏర్పడే కాలుష్యానికి గురవుతున్న 3089 కౌంటీలలో ఈ అధ్యయనం జరిపారు. దీర్ఘకాలం నుంచి కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న కౌంటీల్లో కొవిడ్ మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు ‘జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్’లో తమ అధ్యయన ఫలితాల్ని ప్రచురించారు. ఇకనైనా వాయుకాలుష్య ప్రమాదాన్ని గుర్తించి విధాన రూపకర్తలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అయితే, కాలుష్యానికి.. కొవిడ్ మరణాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం స్పష్టంగా వివరించలేకపోయింది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించేందుకు సహకరించే ఏసీఈ-2 రిపెప్టార్ల ఉత్పత్తిని 2.5 పీఎం ధూళి కణాలు పెంచే అవకాశం ఉందని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అలాగే ఎక్కవ కాలం కాలుష్యానికి గురవ్వడం వల్ల శరీర రోగనిరోధక శక్తి సైతం తగ్గే అవకాశం ఉందని వివరించారు. ఈ రెండు కారణాల వల్ల కాలుష్య ప్రాంతాల్లో అధిక కొవిడ్ మరణాల రేటు నమోదవుతుండొచ్చని విశ్లేషించారు.
వయసు, వారసత్వం, పొగ తాగడం వంటి వ్యక్తిగత కారణాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపిన శాస్త్రవేత్తలు.. అధ్యయనంలో కొన్ని పరిమితులున్నట్లు వివరించారు. అయితే, తాజా అధ్యయనం ఆధారంగా మరింత లోతైన పరిశోధనలు జరిపేందుకు అవకాశం కలిగిందన్నారు. తద్వారా కొవిడ్‌ను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.