Tirumala: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గరుడునిపై మలయప్పస్వామి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు.

Updated : 01 Oct 2022 22:21 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు వెళ్తుండగా.. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. అన్ని గ్యాలరీల వద్ద భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.లలిత్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు వాహన సేవలోపాల్గొన్నారు. 

గరుడసేవ విశిష్టత...

కలియుగ వైకుంఠం తిరుమల అసంఖ్యాక భక్తజనులతో నిండిపోయింది. శ్రీనివాసుడు తన అనుంగు వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల విహరిస్తుండగా ప్రత్యక్షంగా చూసిన లక్షలాదిమంది, టీవీల్లో చూసిన కోట్లాదిమంది పులకించిపోయారు. ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మార్మోగాయి. 

వైకుంఠలోకాత్‌ గరుడేన విష్ణోః
క్రీడాచలో వేంకటనామధేయః
అనీయ చ స్వర్ణముఖీ సమీపే
సంస్థాపతితో విష్ణునివాసహేతోః 
అని పురాణాలు తెలుపుతున్నాయి.
శ్రీమహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం వైకుంఠంలోని క్రీడాద్రిని స్వర్ణముఖికి ఉత్తరంగా ఖగలోకనాథుడు అని ఖ్యాతికెక్కిన గరుత్మంతుడు ప్రతిష్టించాడు. అదే నేడు తిరుమలగా ప్రసిద్ధిచెందింది.

శ్రీమహావిష్ణువుకు గరుత్మంతుడు దాసుడు, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా పలు విధాలుగా స్వామిసేవలో తరిస్తుంటాడు. గరుడ సేవ రోజున మూలమూర్తికి నిత్యం అలంకరించి ఉండే మకరకంఠి, లక్ష్మీహారం.. తదితర ఆభరణాలను మలయప్పస్వామికి అలంకరిస్తారు. భక్తులకే అగ్రపీఠం అన్న రీతిలో వైనతేయుడిని ఆ వైకుంఠనాథుడు అనుగ్రహిస్తాడు. అందుకునే ఆ వాహనంపై స్వామిని చూస్తే కోటిజన్మల పుణ్యఫలం

గరుడసేవ విశిష్టతను అన్నమయ్య వందల ఏళ్ల  క్రితమే పేర్కొన్నాడు.
నానా దిక్కుల నరులెల్లా
నానా దిక్కుల నరులెల్లా

అంటే అప్పట్లోనే స్వామి గరుడసేవకు తిరుమలగిరులకు వచ్చేభక్తులతో కొండ నిండిపోయేదని అర్థం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts