
AP News: కష్టాల్లో ఉన్నాం.. హరితపన్ను వసూలు ఆపండి: లారీ యజమానులు
అమరావతి: కొవిడ్‌తో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి పెంచిన హరితపన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు సీఎం దృష్టికి తెచ్చారు. తీవ్ర మందగమనం ఉన్నందున రోజు వారీ ఖర్చులకు కూడా కష్టమవుతోందని, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోవడంతో వేల లారీలను ఫైనాన్సర్లు స్వాధీనం చేసుకున్నారని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరితపన్ను పెంచిందని పేర్కొన్నారు. హరిత పన్ను రూ.200 నుంచి రూ.20వేల వరకు పెంచడం వల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే హరితపన్ను వసూలును నిలుపుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరిహద్దు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయన్న లారీ యజమానులు.. వెంటనే డీజిల్‌పై పన్ను తగ్గించాలని కోరారు. అన్ని రాష్ట్ర, జిల్లా రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు సీఎంకు విజ్ఞప్తి చేశారు.