శరీరానికి ఎండ పడకపోతే క్యాన్సర్‌ ముప్పు!

తాజాగా విటమిన్‌ డి ఉత్పత్తికి కారణమైన అతినీల లోహిత కిరణాలు తగినంతగా శరీరానికి సోకకపోతే పెద్దపేగు, మలద్వార క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు చెబుతున్నారు.

Published : 08 Jul 2021 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ రోగులకు విటమిన్‌ డి సప్లిమెంట్లు ఇవ్వడం తెలిసిందే. వాటివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. తాజాగా విటమిన్‌ డి ఉత్పత్తికి కారణమైన అతినీల లోహిత కిరణాలు తగినంతగా శరీరానికి సోకకపోతే పెద్దపేగు, మలద్వార క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు చెబుతున్నారు. వాళ్లు 2017, 2018 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల్లోని వాతావరణంలో ఉండే అతినీల లోహిత కిరణాల స్థాయిని, ఆయా దేశాల్లోని పెద్దపేగు-మలద్వార క్యాన్సర్‌ ఉద్ధృతిని అధ్యయనం చేశారు.  పుట్టిన శిశువులు మొదలుకుని 75 ఏళ్ల వరకు ఉన్న వ్యక్తులను పరిశీలించారు. 45 ఏళ్లు పైబడ్డవారిలో యూవీబీ కిరణాలు లోపించడానికి, క్యాన్సర్‌ ముప్పు పెరిగేందుకు దగ్గరి సంబంధం ఉందని కనుగొన్నారు. యూవీబీ కిరణాలకు శరీరం గురికాకపోతే విటమిన్‌ డి కొరత ఏర్పడుతోందని, తద్వారా క్యాన్సర్‌ ముప్పు పెరుగుతోందని చెబుతున్నారు.  
ఇది పరిశీలనే.. అసలు కారణం కనుక్కోవాలి!
ఈ అధ్యయనంలో పాల్గొన్న రాఫేల్‌ క్యూమో ప్రకారం ‘‘మనుషులకు సోకే యూవీబీ కిరణాల్లో హెచ్చుతగ్గుల వల్ల పెద్దపేగు-మలద్వారం క్యాన్సర్‌ నిష్పత్తిలో భారీగా తేడాలను గుర్తించాం. ఇది ప్రాథమిక ఆధారమే అయినప్పటికీ, వయసు మీద పడ్డవారు విటమిన్‌ డి కొరతను నివారించుకోవడం వల్ల  క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చు’’ అన్నారు.  ఈ అధ్యయనానికి అమెరికా స్సేస్‌ ఏజెన్సీ నాసా ఇఒఎస్‌ ఆరా స్సేస్‌క్రాఫ్ట్‌ సేకరించిన యూవీబీ కిరణాల సమాచారాన్ని, గ్లోబొక్యాన్‌ సంస్థ వద్ద గల రోగుల డేటాను ఉపయోగించుకున్నారు. అలాగే 148 దేశాల్లో సూర్యతాపం, ఓజోన్‌ స్థాయి, ప్రజల పొగతాగే అలవాటు, సగటు ఆయుఃప్రమాణంలాంటివి దృష్టిలో పెట్టుకున్నారు. అతి నీల లోహిత కిరణాలు తక్కువగా ఉండే నార్వే, డెన్మార్క్‌, కెనడా తదితర దేశాలతో పాటు, అతిగా ఎండలు కాసే సూడాన్‌, నైజీరియా, ఇండియా, యు.ఎ.ఇ దేశాలను పోల్చి చూశారు.గణాంకాలను పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నామని, అయితే మున్ముందు క్యాన్సర్‌కు గల అసలు కారణాన్ని కనుగొనేందుకు  మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని వారు తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని