Ramoji Rao: రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు

క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. 

Updated : 16 Jun 2024 14:24 IST

హైదరాబాద్‌: క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘కఠినమైన క్రమశిక్షణ రామోజీరావు మొదటి లక్షణం. కలలో కూడా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. 39 సంవత్సరాలు ఛైర్మన్‌తో కలిసి ప్రయాణించా. విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఆయన నిర్మించారు. తెలుగువారికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. ఆయన నిఖార్సైన జర్నలిస్ట్‌. ఉదయం 4 గంటలకే ఛైర్మన్‌ దినచర్య ప్రారంభమయ్యేది. ఆయన జీవితం నుంచి కొన్ని నేర్చుకుని మనం పాటించినా మంచి విజయాలు సాధించవచ్చు’’ అని తెలిపారు. కార్యక్రమంలో ఈనాడు తెలంగాణ సంపాదకుడు డీఎన్‌ ప్రసాద్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ సంపాదకుడు కృష్ణమూర్తి, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ తదితరులు హాజరయ్యారు.

ప్రతి ఆలోచనకు పక్కా ప్రణాళిక: డీఎన్‌ ప్రసాద్

‘‘రిపోర్టర్‌గా చేరి అడ్మినిస్ట్రేషన్‌కు వెళ్లడంతో ఎక్కువసార్లు ఛైర్మన్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఎప్పుడూ చదువుతూనే ఉండేవారు. అందులో బాగున్నవి, బాగా లేనివి మార్క్‌ చేసేవారు. ఇప్పటికీ ఆయన లేరనే ఆలోచన రావడం లేదు. ఏ వ్యాపారం అయినా కొత్తగా ఆలోచించేవారు. ప్రతి ఐడియాను రాసి పెట్టుకొనేవారు. అనుకున్న సమయానికి పనిని పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికను ముందే వేసుకొని.. వాటిని సాధించేవారు. ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలి అనుకొనేవారు’’ అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్‌ ప్రసాద్ తెలిపారు. 

తెలుగు పత్రికకు జాతీయ స్థానం కల్పించారు: శ్రీనివాస్‌ రెడ్డి

‘‘అనుకున్నది సాధించడానికి ఎంతైనా కష్టపడే తత్వం రామోజీరావు సొంతం. తెలుగు పత్రికకు జాతీయ స్థానం కల్పించారు. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ తహతహలాడలేదు. తెలుగు జర్నలిజానికి దేశంలో, విదేశాల్లో పేరు రావడానికి ఎంతో కృషి చేశారు. లోతైన అవగాహన తెచ్చుకున్న తరువాతే అందులో అడుగుపెట్టేవారు. ఆయన వ్యక్తిత్వం  ఉన్నతమైంది’’ అని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ‘యువతపై రామోజీరావుకు ఎనలేని విశ్వాసం. అక్రమ కేసులు వస్తే సిబ్బందికి ఆయన అండగా నిలిచేవారు. రామోజీరావు కళాకారులను ఎంతో ఆదరించేవారు’ అని ప్రముఖ కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ వ్యాఖ్యానించారు.

జర్నలిజాన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లారు: అల్లం నారాయణ

‘‘నేను ఈనాడులో పనిచేయకపోయినా నాపై రామోజీరావు ప్రభావం ఉంది. సమయానికి పత్రిక ఇవ్వడం, డెడ్‌లైన్‌ పాటించడం ఈనాడు ప్రత్యేకత. తెలుగు భాషను శైలి విన్యాసంలో పెట్టింది. జర్నలిజం మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లిన ఘనత రామోజీరావు సొంతం. మీడియాలో సాంకేతికతల, కలర్ పేపర్, టాబ్లాయిడ్ వంటి తెచ్చారు. ఎలాంటి వార్తలు వస్తున్నాయో అనునిత్యం గమనిస్తూ ఉంటారు’’ అని తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు.

ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకున్నా: కలిశెట్టి అప్పల నాయుడు

‘‘స్ట్రింగర్‌గా చేరి ఈనాడులో ఛైర్మన్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా. ఈనాడు విలేకరికి ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారు. దానిని చూసే అప్పట్లోనే ఎప్పటికైనా విలేకరిని కావాలని అనుకున్నా. అనునిత్యం మెరుగైన, కచ్చితమైన వార్తలు ఇచ్చేందుకే ప్రాముఖ్యత ఇచ్చేవారు’’ అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని