
Offbeat: 90 ఏళ్ల బామ్మ కారు డ్రైవింగ్.. వీడియో చూడండి
దేవస్: జీవిత చరమాంక దశలో దైవ చింతనలోనే గడిపే వాళ్లను చూశాం. శరీర పటుత్వం కోల్పోయినా పట్టుదలతో అనుకున్న పనిని సాధించే వారిని చాలా అరుదుగా చూస్తాం. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బామ్మ వృద్ధాప్యంలోనూ ఇంకా ఒంట్లో సత్తా ఉందని నిరూపించింది. 90 ఏళ్ల వయసులో తనకు ఇష్టమని కారు డ్రైవింగ్ నేర్చుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజవర్గంలో బిలావలి ప్రాంతానికి చెందిన రేషమ్ బాయ్ తన్వర్ (90) కారు నడిపి ఔరా అనిపించింది. ‘‘నాకు డ్రైవింగ్ చేయడం ఇష్టం. కార్లతో పాటు ట్రాక్టర్లు కూడా నడపగలను. కుమార్తె, కోడలు సహా మా కుటుంబ సభ్యులందరూ డ్రైవింగ్ చేస్తారు. వారిని చూసి నేనూ డ్రైవింగ్ నేర్చుకున్నాను’’ అని తన్వర్ తెలిపారు. ఈ వీడియోను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తన ట్విటర్లో షేర్ చేశారు. వృద్ధాప్యంలో డ్రైవింగ్ నేర్చుకొని చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిందని బామ్మను ప్రశంసించారు.