Delhi liquor Scam: రాఘవ్‌ బెయిల్‌ 15 నుంచి 5 రోజులకు కుదింపు

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Updated : 09 Jun 2023 15:03 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మాగుంట రాఘవ్‌ బెయిల్‌ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు కుదించింది. ఈనెల 12న స్థానిక కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

‘‘బెయిల్‌ పొందే విషయంలో రాఘవ్‌ కోర్టుకు అబద్ధాలు చెప్పారు. మోసపూరితంగా బెయిల్‌ పొందారు. తొలుత అమ్మమ్మకు, తర్వాత నానమ్మకు అనారోగ్యం అన్నారు. ఆ తర్వాత భార్య ఆత్మహత్యాయత్నం పేరుతో తప్పుడు ఆధారాలు ఇవ్వబోయారు. నివేదికలు, ధ్రువపత్రాలు పరిశీలించాలంటే పిటిషన్‌ వెనక్కి తీసుకున్నారు. ధనవంతులు ఇలాంటి వైద్య నివేదికలు తేవడం పరిపాటిగా మారింది. రాఘవ్‌కు సాధారణ బెయిల్‌ ఇచ్చేందుకు ట్రయల్‌ కోర్టు నిరాకరించింది. కుటుంబసభ్యుల అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్‌కు ప్రయత్నిస్తున్నారు’’ అని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మాగుంట రాఘవ్‌ ఇప్పటికే బెయిల్‌పై విడుదలైనందున దాని కాలాన్ని ఐదు రోజులకు కుదిస్తున్నామన్న సుప్రీంకోర్టు.. ఈనెల 12న తప్పనిసరిగా స్థానిక కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని