Corona Crisis: తెలంగాణకు మహీంద్రా గ్రూపు భారీ సాయం

కరోనా వైరస్‌ ప్రభావంతో నెలకొన్న సంక్షోభ సమయంలో మహీంద్రా గ్రూపు తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలిచింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు .......

Published : 06 Sep 2021 19:19 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో నెలకొన్న సంక్షోభ సమయంలో మహీంద్రా గ్రూపు తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలిచింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న  పోరాటంలో తన వంతుగా భారీ సహకారం అందించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పబ్లిక్‌ ఛారిటీ ఆస్పత్రులకు మూడు ఆక్సిజన్‌ ప్లాంట్లు, 12 అంబులెన్సులను అందించి తన దాతృత్వాన్ని చాటుకుంది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో వృద్ధుల వ్యాక్సినేషన్‌కు క్యాబ్‌ సర్వీసులు అందించడంతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్ల రవాణాలో కూడా సాయం చేసినట్టు ఆ గ్రూపు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది  ఫేష్‌ షీల్డ్‌లతో పాటు రేషన్‌ కిట్లు, ఆహార పొట్లాలు, ఫేస్‌ మాస్కులు, పీపీఈ కిట్లు, ఏరోసాల్‌ బాక్సులు, పలు ఆస్పత్రులకు వైద్య పరికరాలను సైతం అందించినట్టు తెలిపింది.  టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ సహకారంతో హైదరాబాద్‌లోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రిలో 500 ఎల్‌పీఎమ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయగా..  మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు అదనంగా మహబూబ్‌నగర్‌లో 1000 ఎల్‌పీఎం ఆక్సిజన్‌ ప్లాంట్‌, పారిశ్రామిక ప్రాంతమైన జహీరాబాద్‌లో 500 ఎల్‌పీఎం ఆక్సిజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో పేర్కొంది.  

మంత్రి కేటీఆర్‌ ప్రశంస

మరోవైపు, సెయింట్‌ థెరిసా ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేస్తోన్న పోరాటంలో మహీంద్రా గ్రూపు క్రియాశీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆ గ్రూపు విరాళంగా ఇచ్చిన ఆక్సిజన్‌ ప్లాంట్లు, అంబులెన్సులు పేద, అట్టడుగు వర్గాల ప్రజలకు ఛారిటబుల్‌ ఆస్పత్రులు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు దోహదపడతాయన్నారు. కరోనా మహమ్మారి మనం అత్యవసర వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా గూపు బోర్డు సభ్యుడు సీపీ గుర్నానీ తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు పారిశ్రామికవర్గాలతో పాటు ప్రభుత్వం, ప్రజలు కలిసి ఐక్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని