Mahamood ali: శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి: మహమూద్‌ అలీ

శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలు అరికట్టడంలో రాష్ట్ర పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

Updated : 21 Oct 2022 11:44 IST

పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన హోంమంత్రి, డీజీపీ

హైదరాబాద్‌: శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలు అరికట్టడంలో రాష్ట్ర పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. గోషామహల్‌ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా అమరులైన 264 మంది పోలీసులకు హోంమంత్రితో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు నివాళులర్పించారు.

అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్‌శాఖ సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో దేశంలోనే ముందంజలో ఉన్నట్లు తెలిపారు. ఒకే రాష్ట్రం.. ఒకే సేవ సూత్రంతో పనిచేస్తున్నామని.. జవాబుదారీతనం, పారదర్శకత, స్నేహపూర్వక పోలీసు సేవలను అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు డీజీపీ చెప్పారు. పటిష్ఠమైన శాంతిభద్రతల నిర్వహణకు అద్భుత, సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ కలిగిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉపయోగపడుతోందన్నారు. నేరం చేస్తే శిక్ష తప్పించుకోలేని విధంగా చర్యలు తీసుకుంటున్నామని.. పౌరుల భద్రతే లక్ష్యంగా పోలీసుశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని డీజీపీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని