
అక్కడ పర్యటిస్తే ట్రావెల్ పాయింట్లు ఇస్తారట!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా.. లాక్డౌన్ కారణంగా అటకెక్కిన పర్యటక రంగం.. ఇప్పుడిప్పుడే పర్యటకులకు దారులు తెరిచి ఆహ్వానిస్తోంది. రాష్ట్రాలు, దేశాలు కరోనా నిబంధనలకు లోబడి పర్యటకులకు సందర్శన నిమిత్తం అనుమతులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సమయంలోనూ అందరికంటే ముందే పర్యటక రంగాన్ని పునఃప్రారంభించిన మాల్దీవులు తమ పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. మాల్దీవులను సందర్శించే పర్యటకులకు క్రెడిట్/డెబిట్‌కార్డులు ఇచ్చే రివార్డు పాయింట్ల తరహాలో ట్రావెల్ పాయింట్లు ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది.
మాల్దీవులు ఒక ద్వీపసమూహం.. హిందూ మహాసముద్రంలో ఉంటుంది. ఏటా అనేక దేశాల నుంచి లక్షలాది పర్యటకులు ఇక్కడి దీవుల్ని సందర్శించడానికి వస్తుంటారు. ఈ దేశానికి పర్యటక రంగమే అతిపెద్ద ఆర్థిక వనరు. అందుకే ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా పర్యటకులకు గేట్లు తెరిచేపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన కొత్తలో కొన్ని ఐలాండ్స్‌ను మూసివేసిన మాల్దీవులు పర్యటకశాఖ.. జులై నుంచి దశలవారీగా పునఃప్రారంభిస్తూ వస్తోంది. అయితే, ఇటీవల మాల్దీవులు పర్యటకశాఖ ఈ రంగం పుంజుకోవడం కోసం ‘మాల్దీవ్స్ బార్డర్ మైల్స్’ పేరుతో వినూత్న పథకాన్ని ప్రారంభించింది.
ఇందులో మూడు రకాల(గోల్డ్, సిల్వర్, బ్రాంజ్) శ్రేణులు ఉంటాయట. మాల్దీవులకు వచ్చే పర్యటకుల సందర్శన సంఖ్యను బట్టి, బస చేసే రోజులను బట్టి వారికి ట్రావెల్ పాయింట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేవలం వేడుకలు నిర్వహించేందుకు వస్తే అదనంగా ట్రావెల్ పాయింట్లు ఇస్తారట. ఈ ట్రావెల్ పాయింట్లను బట్టి పర్యటకులు మరోసారి మాల్దీవులకు వచ్చినప్పుడు రాయితీలు, ఇతర లాభాలు పొందొచ్చట. మాల్దీవ్స్ బార్డర్ మైల్స్ పథకం ఈ డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. ఈ ట్రావెల్ పాయింట్లు పొందాలంటే ఈ పథకంలో తమ వివరాలు నమోదు చేసి పర్యటనకు రావాలని అక్కడి పర్యటకశాఖ సూచిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.