Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని

Updated : 19 Mar 2022 20:17 IST

హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91)(Mallu swarajyam) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కర్విరాల కొత్తగూడెంలో ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. ఐదో తరగతి వరకే చదువుకున్న ఆమె.. తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో పోరాట పంథాలోకి వచ్చారు. 1945-48 మధ్య మహోజ్వలంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించేలా సభలు నిర్వహించేవారు. ఆనాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళల్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతో పాటు మూడువందల మంది మహిళలు మేజర్ జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ, ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు(1978, 1983లలో) తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు చేశారు. 

మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి (వీఎన్‌) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2004 డిసెంబర్ 4న మరణించారు. వీరికి ఒక కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి (వైద్యుడు), మల్లు నాగార్జునరెడ్డి (న్యాయవాది) ఉన్నారు. కుమార్తె భాజపాలో ఉండగా.. చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా కొనసాగుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని