Updated : 10 Feb 2021 04:32 IST

ఒక్కడే 10వేల బావులు తవ్వించాడు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత రోజురోజుకు పెరుగుతోంది. రానున్న కాలంలో నీటి కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే నీటి పొదుపుపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాయి. మన దేశంలోనూ ప్రభుత్వం నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే వర్షపునీటిని ఒడిసిపట్టి నీటి అవసరాలు తీర్చుకునేలా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వాలే కాదు.. పలు స్వచ్ఛంద సంస్థలు సైతం నీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్నాయి. వాటిలో ఒకటి ‘రెయిన్‌ వాటర్‌ క్లబ్‌’. బెంగళూరుకు చెందిన విశ్వనాథ్‌ శ్రీకాంతయ్య ఈ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. నీటి పొదుపులో నేను సైతం అంటూ ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే కర్ణాటక వ్యాప్తంగా మూతపడిన 10వేలకుపైగా బావులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చాడు.

సివిల్‌ ఇంజినీరైన విశ్వనాథ్‌ శ్రీకాంతయ్య ఒక అర్బన్‌ ప్లానర్‌. హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 14 ఏళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి స్వస్తి పలికి నీటి సంరక్షణపై దృష్టి సారించాడు. ఈ కాలంలో చాలా మంది బోర్‌ వేయించుకుంటారు కానీ, ఉన్న బావుల్ని బాగు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. పట్టణాల్లో అయితే, ఒక్క బావి కూడా కనిపించదు. పల్లె ప్రాంతాల్లో ఉన్న బావులు కనుమరుగవుతున్నాయి. అందుకే శ్రీకాంతయ్య రెయిన్‌ వాటర్‌ క్లబ్‌ స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా అనే ప్రాంతాల్లో స్థానిక కమ్యూనిటీలతో చర్చించి మూతపడిన బావులను తిరిగి తవ్విస్తున్నాడు. ఇప్పటి వరకు శ్రీకాంతయ్య 10వేల బావులను పునఃరుద్ధరించాడు. నీటి కష్టాలు తీర్చడం కోసం అహర్నిశలు పనిచేస్తున్న శ్రీకాంతయ్యకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుంది. అందుకే ఆయన్ను ‘జన్‌రెయిన్‌మ్యాన్‌’ అని కర్ణాటకలో పిలుస్తుంటారు. కేవలం బావుల పునరుద్దరణే కాదు.. తన చదువు, వృత్తిపరమైన అనుభవాన్ని ఉపయోగించి వర్షపు నీటిని ఒడిసిపట్టేలా రూఫ్‌టాప్‌పై అమర్చుకునే ప్రత్యేక నిర్మాణాలను రూపొందించాడు. వాటిని ఇళ్లు, ఫ్యాక్టరీలపై అమర్చుకునేలా ప్రోత్సహిస్తున్నాడు.

అంతటితో శ్రీకాంతయ్య ఆగిపోలేదు. తనకు ప్రజలు పెట్టిన పేరు ‘జన్‌రెయిన్‌మ్యాన్‌’తోనే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. అందులో నీటిని పొదుపు చేసేందుకు, సంరక్షించేందుకు చిట్కాలు చెబుతున్నాడు. నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నాడు. నీటిపై చర్చలు ఎక్కడ జరిగినా వాటిలో పాల్గొనడానికి శ్రీకాంతయ్య ముందుంటాడు. ఈ క్రమంలో అనేక చోట్ల నీటి సంరక్షణపై ప్రసంగాలు చేశాడు. తన సొంత రాష్ట్రం కర్ణాటకలో పది లక్షల బావులను పునఃరుద్ధరించడమే లక్ష్యంగా శ్రీకాంతయ్య ముందుకు సాగుతున్నాడు.

ఇవీ చదవండి..

చదివింది నాలుగు.. నాలుగు భాషల్లో నిఘంటువు

87ఏళ్ల వైద్యుడు.. ఎందరికో ఆదర్శప్రాయుడు!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని